: లంకేయుల గెలుపుతో అత్యంత ఉత్కంఠగా గ్రూప్-బి సమీకరణాలు... ఎవరి అవకాశాలు ఎలా ఉన్నాయంటే..!
అత్యంత బలమైన బ్యాటింగ్ లైనప్ తో, టైటిల్ ఫేవరెట్ గా, డిఫెండింగ్ చాంపియన్ గా బరిలోకి దిగిన భారత జట్టును 7 వికెట్ల తేడాతో శ్రీలంక అలవోకగా, ఓడించిన తరువాత గ్రూప్-బి నుంచి చాంపియన్స్ ట్రోఫీలో సెమీస్ కు వెళ్లే రెండు జట్లపై తీవ్ర ఆసక్తి నెలకొంది. గ్రూప్ లోని నాలుగు జట్లూ రెండేసి పాయింట్లతో ఉండటమే ఈ ఉత్కంఠకు కారణం. మరో రెండు మ్యాచ్ లు మాత్రమే మిగిలున్నాయి. ఇండియా, దక్షిణాఫ్రికాల మధ్య ఆదివారం నాడు, శ్రీలంక, పాకిస్థాన్ నడుమ సోమవారం నాడు మ్యాచ్ లు ఉన్నాయి. ఇక్కడ ఇండియాకు ఉన్న ఒకే ఒక్క ప్లస్ పాయింట్ ఏంటంటే, పాక్ పై సాధించిన మెరుగైన విజయంతో రన్ రేట్ లో మిగతా మూడు జట్ల కన్నా ముందు నిలవడమే.
ఇక దక్షిణాఫ్రికాతో జరిగే మ్యాచ్ లో భారత్ గెలిస్తే, తప్పకుండా సెమీస్ కు వెళుతుంది. ఆపై శ్రీలంక, పాకిస్థాన్ మ్యాచ్ లో గెలిచే జట్టు దక్షిణాఫ్రికాను ఇంటికి పంపి సెమీస్ కు అర్హత పొందుతుంది. అయితే, వరుణుడు ఎప్పుడు ఏ మ్యాచ్ కి అడ్డుపడతాడో తెలియని పరిస్థితుల్లో, ఒకవేళ దక్షిణాఫ్రికా, భారత్ మధ్య మ్యాచ్ రద్దయితే ఇండియా సెమీస్ కు వెళుతుంది. ఎందుకంటే, మ్యాచ్ రద్దుతో ఒక పాయింట్ సాధించడం, మెరుగైన రన్ రేట్ ఉన్న కారణంగా లంక, పాక్ లమ్యాచ్ లో ఎవరు గెలిచినా, వారితో పాటు సెమీస్ కు స్థానం పొందుతుంది. ఒకవేళ ఈ మ్యాచ్ కూడా రద్దయినా, భారత్ కు వచ్చే నష్టం ఉండదు. ఇక దక్షిణాఫ్రికా గెలిస్తే మాత్రం ఇండియాకిక మరో అవకాశం ఉండదు. అంటే సౌతాఫ్రికాపై తప్పనిసరిగా గెలవాల్సిన స్థితిలో ఆదివారం నాడు భారత జట్టు బరిలోకి దిగనుంది.