: బెట్టింగ్ విషాదం.. ఆత్మహత్య చేసుకున్న కొత్త పెళ్లికొడుకు!


క్రికెట్ బెట్టింగ్ మోజులో పడి చివరకు భార్య బంగారాన్ని కూడా పోగొట్టుకున్న, కొత్తగా పెళ్లయిన  ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషాద సంఘటన హైదరాబాద్ లోని స్థానిక బాపూజీనగర్ లో జరిగింది. పేట్ బషీర్ బాద్ పోలీస్ స్టేషన్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, ఘనశ్యామ్ (27) అనే యువకుడు బాపూజీనగర్ లో కిరాణా దుకాణం నిర్వహిస్తూ ఉంటాడు. ఈ ఏడాది ఏప్రిల్ లో అతని వివాహం జరిగింది. అయితే, క్రికెట్ బెట్టింగ్ కు అలవాటుపడ్డ ఘనశ్యామ్ ఎంతో నష్టపోయాడు. చివరకు, తన భార్యకు చెందిన 28 తులాల బంగారు నగలను కూడా బెట్టింగ్ లో పెట్టి నష్టపోయాడు.

దీంతో, తీవ్ర మనస్తాపం చెందిన ఘన శ్యామ్, కుటుంబసభ్యులందరూ నిద్రిస్తున్న సమయంలో, నిన్నరాత్రి తన ఇంట్లో ఫ్యాన్ కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించగా, అతను రాసిన సూసైడ్ నోట్ లభించింది. ‘సారీ మమ్మీ, సారీ డాడీ..’ అని ఆ లేఖలో రాసి ఉంది. సూసైడ్ నోట్ ను స్వాధీనం చేసుకున్న పోలీసులు, అతని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

  • Loading...

More Telugu News