: ఖతార్ 'ఉగ్ర' జాబితాను విడుదల చేసిన సౌదీ కూటమి
తమ దేశంపై జరుగుతున్న దౌత్య దాడిని అడ్డుకుని తీరుతామని, సౌదీ అరేబియా ఆంక్షలకు తలొగ్గేది లేదని ఖతార్ స్పష్టం చేసిన గంటల వ్యవధిలో, ఆ దేశానికి, ఉగ్రవాద సంస్థలకు మధ్య ఉన్న లింకులను సౌదీ విడుదల చేసింది. ఖతార్ లో ఉండి ఉగ్రవాదులకు నిధులందిస్తున్న సంస్థలు, వ్యక్తులతో కూడిన జాబితాను విడుదల చేసింది. సౌదీతో కలసి ఖతార్ ను వెలివేసిన నాలుగు దేశాల కూటమి (సౌదీ, యూఏఈ, ఈజిప్ట్, బెహరైన్) తొలిసారిగా సంయుక్త ప్రకటనను విడుదల చేస్తూ, ఓ వైపు ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడతామని చెబుతూనే, మరోవైపు వారికి మద్దతిస్తూ, నిధులను అందిస్తోందని ఆరోపించింది.
కాగా, ఈ జాబితాలో ఇప్పటికే అంతర్జాతీయ స్థాయిలో ఉగ్రవాదులకు నిధులిస్తున్నారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న కంపెనీలు, గతంలో ఖతార్ ప్రభుత్వం చర్యలు తీసుకున్న సంస్థల పేర్లూ ఉన్నాయి. సద్ అల్ కాబి, అబ్ద్ అల్ లతీఫ్ అల్ కవారీ తదితర బిలియనీర్ల పేర్లూ ఈ జాబితాలో ఉన్నాయి. మొత్తం 59 మంది వ్యక్తులు, 12 కంపెనీలతో కూడిన జాబితాను అందిస్తూ, తక్షణం అందరిపైనా చర్యలకు డిమాండ్ చేసింది.