: నటి త్రిషకు విధించిన జరిమానా రద్దుపై హైకోర్టు కెక్కిన ఐటీ శాఖ
ప్రముఖ దక్షిణాది నటి త్రిషకు విధించిన జరిమానాను ట్రైబ్యునల్ రద్దు చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఆదాయ పన్నుశాఖ మద్రాసు హైకోర్టును ఆశ్రయించింది. 2010-11వ సంవత్సరంలో తన ఆదాయం రూ.89 లక్షలుగా అడ్వాన్స్ రిటర్న్స్ త్రిష దాఖలు చేసింది. అయితే, సినిమాల్లో నటించే నిమిత్తం తీసుకున్న అడ్వాన్స్ లను ఇందులో కలపలేదు. ఐటీ నిబంధనల ప్రకారం, అడ్వాన్స్ గా తీసుకున్న మొత్తం కూడా ఆదాయ పరిధిలోకి వస్తాయి.
ఈ విషయాన్ని స్పష్టం చేస్తూ త్రిషకు రూ.1.15 కోట్ల జరిమానాను విధించింది. ఐటీ శాఖ జరిమానా విధించడం సబబు కాదంటూ ట్రైబ్యునల్ ను త్రిష ఆశ్రయించడం, ఆమెకు అనుకూలంగా తీర్పు రావడం జరిగింది. అయితే, ఈ తీర్పును సవాల్ చేస్తూ ఐటీ శాఖ మద్రాసు హైకోర్టులో నిన్న పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ పై విచారణ జరిపిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఇందిరా బెనర్జీ, న్యాయమూర్తి సుందర్ లతో కూడిన ధర్మాసనం ఈ కేసు విచారణను ఈ నెల 13వ తేదీకి వాయిదా వేసింది.