: గేమ్ చేంజ్ చేసిన సీఆర్‌పీఎఫ్.. దోపిడీ అయిన ఆయుధాల గుర్తింపునకు టెక్నాలజీ!
దేశంలోనే అతిపెద్ద పారామిలటరీ ఫోర్స్ అయిన సీఆర్‌పీఎఫ్ వ్యూహం మార్చింది. కనిపించకుండా పోయిన, మావోయిస్టులు, తీవ్రవాదులు ఎత్తుకెళ్లిన ఆయుధాలను గుర్తించేందుకు సాంకేతికతను ఉపయోగించుకోవాలని నిర్ణయించింది. సీఆర్‌పీఎఫ్ సిబ్బంది తమ ఆపరేషన్‌లో భాగంగా సెమీ-ఆటోమెటిక్ రైఫిల్స్, ఏకే రైఫిల్స్, ఎస్ఎల్ఆర్‌లు, ఇన్సాస్ రైఫిల్స్ తదితర వాటిని ఉపయోగిస్తుంటారు. కొన్నిసార్లు సీఆర్‌పీఎఫ్ క్యాంపులపై మావోయిస్టులు, జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదులు దాడులు చేసి పెద్ద ఎత్తున ఈ ఆయుధాలను ఎత్తుకెళ్తున్నారు. తద్వారా వారు మరింత బలోపేతం అవుతున్నారు. దీంతో వారు ఎత్తుకెళ్లిన ఆయుధాలను తిరిగి తెచ్చుకునే పనిలో పడిన సీఆర్‌పీఎఫ్ అధికారులు అందుకు టెక్నాలజీని ఉపయోగించుకోవాలని నిర్ణయించారు.
ఇందులో భాగంగా సాంకేతికతను అందించే ప్రైవేటు కంపెనీలతో సీఆర్‌పీఎఫ్ అధికారులు చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తోంది. జీపీఎస్ ట్రాకర్/ఆర్ఎఫ్ఐడీ చిప్, లేదంటే బయోమెట్రిక్ సాఫ్ట్‌వేర్‌ను ఆయా కంపెనీలు అందిస్తాయి. తద్వారా అవి దోపిడీకి గురైనప్పుడు అవి ఎక్కడున్నాయో సులభంగా గుర్తించే వీలుంటుంది. సీఆర్‌పీఎఫ్ సాంకేతికతను ఉపయోగించుకునేందుకు సిద్ధమవుతున్నట్టు వస్తున్న వార్తలు నిజమేనని సీఆర్‌పీఎఫ్ డైరెక్టర్ జనరల్ రాజీవ్ రాయ్ భట్నాగర్ తెలిపారు. అమెరికా లాంటి దేశాలు ఇప్పటికే ఈ టెక్నాలజీని వాడుతున్నట్టు ఆయన పేర్కొన్నారు.