: భయం వద్దు కానీ.. అప్రమత్తంగా ఉండండి: ఖతర్‌లోని భారతీయులకు భారత్ సలహా!


ఖతర్‌తో అరబ్ దేశాలు సంబంధాలు తెంచుకున్న నేపథ్యంలో అక్కడ నివసిస్తున్న భారతీయులు అప్రమత్తంగా ఉండాలని భారత్ హెచ్చరించింది. అయితే భయపడాల్సిన అవసరం లేదని సూచించింది. ఉగ్రవాదానికి ఖతర్ ఆశ్రయమిస్తోందన్న ఆరోపణలతో నాలుగు అరబ్ దేశాలు ఆ దేశంతో సంబంధాలు తెంచుకున్నాయి. జల, వాయు మార్గాలను మూసేశాయి. దీంతో అక్కడ నివసిస్తున్న 6.30 లక్షల మంది భారతీయులు ఆందోళనకు గురయ్యారు. దీంతో స్పందించిన దోహాలోని భారత రాయబార కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. అక్కడ జరిగే పరిణామాలను ప్రభుత్వం అనుక్షణం గమనిస్తోందని, అప్రమత్తంగా ఉండాలని సూచించింది. భారతీయుల రక్షణ కోసం ఖతర్ అధికారులతో ఎప్పటికప్పుడు మాట్లాడుతున్నట్టు తెలిపింది.

సౌదీ నుంచి ఖతర్‌కు ఒకే ఒక రోడ్డు మార్గం ఉంది. దాని ద్వారానే అన్ని రకాల వస్తువులు సరఫరా అవుతుంటాయి. ఇప్పుడు దానిని మూసివేశారు. దీంతో ఖతర్ ప్రజల్లో ఆందోళన నెలకొంది. అయితే భయపడాల్సిన అవసరం లేదని, అన్ని వస్తువుల నిల్వలు సరిపడా ఉన్నాయని ఖతర్ ప్రభుత్వం స్పష్టం చేసింది. అంతేకాక అవసరమైతే ఖతర్‌కు అవసరమైన నిల్వలను పంపించేందుకు భారత్ సిద్ధంగా ఉందని తెలిపింది. భవిష్యత్తులోనూ అండగా నిలుస్తామని భారత్ హామీ ఇచ్చినట్టు ఖతర్ అధికారులు తెలిపారు.

  • Loading...

More Telugu News