: అవును.. ఆ రైతులు పోలీసు కాల్పుల్లోనే మృతి చెందారు.. కేంద్రానికి తెలిపిన ఎంపీ ప్రభుత్వం


మాండసౌర్‌లో రైతులు మరణించింది పోలీసు కాల్పుల వల్లనేనని మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం కేంద్ర హోంమంత్రిత్వ శాఖకు తెలియజేసింది. రైతుల ఆందోళన హింసాత్మకంగా మారడంతో వారిని అదుపు చేసేందుకు పోలీసులు కాల్పులు జరపాల్సి వచ్చిందని, ఈ ఘటనలో ఐదుగురు రైతులు మృతి చెందారని తెలిపింది. లాఠీచార్జ్ ద్వారా వారిని అదుపు చేసేందుకు పోలీసులు ప్రయత్నించారని, తర్వాత టియర్ గ్యాస్ కూడా ప్రయోగించినట్టు కేంద్రానికి పంపిన నివేదికలో పేర్కొంది. అయినా రైతులు హింసను వీడలేదని, విధ్వంసం సృష్టించారని, ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేశారని పేర్కొంది. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో కాల్పులు జరపాల్సి వచ్చిందని, ఈ ఘటనలో ఐదుగురు రైతులు చనిపోగా 8 మంది గాయపడ్డారని తెలిపింది.

రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం రైతులు పెద్ద ఎత్తున మాండసౌర్‌లోని పిప్లియా మండీ ప్రాంతంలో ఆందోళన నిర్వహించారు. 25 ట్రక్కులను తగలబెట్టారు. ఆస్తులను ధ్వంసం చేశారు. పలు దుకాణాలను దోచుకున్నారు. ఈ ఘటనతో ప్రమేయమున్న ఏడుగురిని అదుపులోకి తీసుకున్నట్టు పోలీసులు తెలిపారు.

  • Loading...

More Telugu News