: నాసా ఆస్ట్రోనాట్ గా ఎంపికైన భారత సంతతి వ్యక్తి రాజాచారి!
ఎర్త్ ఆర్బిట్ అండ్ డీప్ స్పేస్ మిషన్ల నిమిత్తం నాసా త్వరలో చేపట్టనున్న అంతరిక్ష ప్రయోగానికి ఎంపికైన వ్యోమగాముల్లో భారత సంతతికి చెందిన రాజాచారి(39)కి అవకాశం లభించింది. యూఎస్ ఎయిర్ ఫోర్స్ లో లెఫ్టినెంట్ కల్నల్ గా ఆయన పని చేస్తున్నారు. 461 ఫ్లైట్ టెస్ట్ స్క్వాడ్రన్ లో కమాండర్ గాను, కాలిఫోర్నియాలోని ఎడ్వర్డ్స్ ఎయిర్ ఫోర్స్ బేస్ లో ఎఫ్-35 ఇంటిగ్రేటెడ్ టెస్ట్ ఫోర్స్ కు డైరెక్టర్ గాను ఆయన వ్యవహరిస్తున్నారు.
కాగా, నాసా నిర్వహించనున్న ఈ ప్రయోగానికి గాను గతంలో దరఖాస్తులను ఆహ్వానించగా, పద్దెనిమిది వేల మందికి పైగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 12 మందిని నాసా ఎంపిక చేసింది. ఈ పన్నెండు మందిలో రాజాచారి ఒకరు. ఇదిలా ఉండగా, మసాచూసెట్స్ ఇనిస్టిట్యూట్ నుంచి ఏరోనాటిక్స్ అండ్ ఆస్ట్రోనాటిక్స్ లో ఆయన మాస్టర్స్ డిగ్రీ, అమెరికాలోని నావల్ టెస్ట్ పైలట్ స్కూల్ నుంచి డిగ్రీ పొందారు. ప్రస్తుతం అయోవా రాష్ట్రంలోని వాటర్లూ నగరంలో ఆయన నివసిస్తున్నారు.