: భారత్‌కు షాకిచ్చిన లంకేయులు.. చాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా ఓటమి


చాంపియన్స్ ట్రోఫీలో పాక్‌పై గెలుపుతో ఉత్సాహం మీదున్న టీమిండియాకు శ్రీలంక షాకిచ్చింది. గురువారం కెన్నింగ్టన్‌లో జరిగిన గ్రూప్-బి మ్యాచ్‌లో ఏడు వికెట్ల తేడాతో భారత్‌ను చిత్తు చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 321 పరుగులు చేసింది. అనంతరం బరిలోకి దిగిన శ్రీలంక మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని అవలీలగా ఛేదించింది. 93 బంతుల్లో 11 ఫోర్లు, సిక్స్‌తో 89 పరుగులు చేసిన కుశాల్ మెండిస్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. గుణతిలక 76, మ్యాథ్యూస్ 52 కుశాల్ పెరీర, గుణరత్నె 34 పరుగులు చేసి మరో 8 బంతులు మిగలి ఉండగానే శ్రీలంకను విజయ తీరాలకు చేర్చారు. భారత బౌలర్లలో భువనేశ్వర్ కుమార్‌కు మాత్రమే ఒక వికెట్ దక్కగా, మిగతా రెండు రనౌట్లు కావడం గమనార్హం.

అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్ ఓపెనర్లు రోహిత్ శర్మ, శిఖర్ ధవన్‌లు అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చారు. ధవన్ (128 బంతుల్లో 15  ఫోర్లు, సిక్స్‌తో 125 పరుగులు) సెంచరీతో రెచ్చిపోయాడు. ఫామ్‌లో ఉన్న రోహిత్ శర్మ (79 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్‌లతో 78 పరుగులు) మరోమారు సత్తా చాటాడు. చివర్లో ధోని 52 బంతుల్లో 7  పోర్లు, 2 సిక్సర్లతో 63 పరుగులు చేసి స్కోరు బోర్డును ఉరకలెత్తించాడు. చివర్లో కేదార్ జాదవ్ 13 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 25 పరుగులు పిండుకోవడంతో భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 321 పరుగులు చేసింది. శ్రీలంక బౌలర్లు లసిత్ మలింగ‌కు రెండు, లక్మల్, ప్రదీప్, పెరీరా, గుణరత్నేలకు ఒక్కో వికెట్ దక్కింది.

  • Loading...

More Telugu News