: ఎన్నో మృతదేహాలు దాటుకుంటూ ఎవరెస్ట్ అధిరోహించాం: విద్యార్థిని రాణి

 ఎవరెస్టు శిఖరాన్ని ఇటీవల అధిరోహించి వచ్చిన విద్యార్థులను ఏపీ సీఎం చంద్రబాబునాయుడు అభినందించారు. కాకినాడ మహా సంకల్స సభలో వారికి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఎవరెస్టు అధిరోహించిన విద్యార్థులకు ఒక్కొక్కరికి పది లక్షల రూపాయల చొప్పున నగదు పురస్కారాన్ని అందజేశారు. ఎవరెస్టు ఎక్కేందుకు వెళ్లి విఫలమైన విద్యార్థులకూ ఒక్కొక్కరికీ రూ.5 లక్షల చొప్పున చంద్రబాబు అందజేశారు.

 ఈ సందర్భంగా పొలసానిపల్లి సాంఘిక సంక్షేమ జూనియర్ కళాశాలకు చెందిన విద్యార్థిని రాణి మాట్లాడుతూ, ‘పుస్తకాల్లో చదవడమే తప్పా, ఎవరెస్టు ఎలా ఉంటుందో తెలియదు. పెద్ద సాహసానికి మేము సిద్ధపడుతున్నప్పుడు ప్రోత్సహించిన మా తల్లిదండ్రులకు ప్రత్యేక కృతజ్ఞతలు. కేతనకొండలో ట్రైనింగ్ తీసుకున్న అనంతరం, ఎవరెస్ట్ ఎక్కేందుకు ఏప్రిల్ 8న బయలుదేరి వెళ్లాం. బేస్ క్యాంప్ కు చేరుకున్నాక ఎన్నో ఇబ్బందులు పడ్డాం. ఉష్ణోగ్రతలు చాలా తక్కువ. గాలుల తీవ్రతకు కొట్టుకుపోయే పరిస్థితి ఉన్నా, ఎవరెస్ట్ ఎక్కాలనే పట్టుదలతో సుమారు రెండు వందల మృతదేహాలను దాటుకుంటూ ముందుకువెళ్లాం. తిరిగి వెనక్కి వస్తామనే నమ్మకం లేదు. ఆ క్షణంలో మా తల్లిదండ్రులు గుర్తుకువచ్చారు. ఎట్టకేలకు ఎవరెస్ట్ చేరాం. ఆ దృశ్యం అద్భుతం. ఎవరెస్ట్ పై భారత పతాకం ఎగురవేసి మురిసిపోయాం. పెద్దమొత్తంలో మాపై ఖర్చు చేసి, ధైర్యం చెప్పిన ప్రభుత్వానికి, ఆదరించి సాయం చేసిన సీఎం చంద్రబాబుగారికి కృతజ్ఞతలు’ అని చెప్పింది.

More Telugu News