: 'ఐరాస'కు పాకిస్థాన్ పై భారత్ మరో ఫిర్యాదు!
ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పాకిస్థాన్‌పై భారత్ మరోసారి ఐక్యరాజ్య సమితిలో ఫిర్యాదు చేసింది. గతంలో భారత్... పాకిస్థాన్‌ను ఉగ్రవాదులకు మాతృదేశంగా అభివర్ణించిన విషయం తెలిసిందే. తాజాగా అదే విషయాన్ని తెలియజేస్తూ ఆ దేశం తీవ్రవాదులకు కర్మాగారంగా మారిందని భారత్ పేర్కొంది. పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదంతో దక్షిణాసియాలో సుస్థిరతకు విఘాతం కలుగుతుందని ఐరాస మానవ హక్కుల కౌన్సిల్‌కు చేసిన ఫిర్యాదులో తెలిపింది. భారత్‌పై పాకిస్థాన్ గతంలో ఫిర్యాదు చేస్తూ కశ్మీర్‌లో కల్లోలం సృష్టిస్తోందని ఆరోపించింది. ఈ అంశంపై భారత్ దీటుగా సమాధానం ఇచ్చింది. అంతర్జాతీయ సంస్థల నుంచి పొందుతున్న బిలియన్ డాలర్లను పాకిస్థాన్ తప్పుడు చర్యలకు ఉపయోగిస్తోందని, ఉగ్రవాద సంస్థల ఆర్థిక సాయం, శిక్షణ కోసం వినియోగిస్తోందని తెలిపింది. తద్వారా పాక్ తన పొరుగు దేశాలపై దాడులు చేయిస్తుందని పేర్కొంది.
భారత్‌కు వ్యతిరేకంగా తీవ్రవాదాన్ని ప్రోత్సహించడం వంటి చర్యలను పాక్ మానుకోవాలని ఇండియా డిమాండ్ చేసింది. భారత అంతర్గత విషయమైన కశ్మీర్ విషయంలో పాక్ జోక్యం చేసుకుంటోందని, అంతేగాక, సరిహద్దుల్లో కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తోందని భారత్ తెలిపింది. అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘిస్తూ పాకిస్థాన్ ఉగ్రవాదానికి ఊతమిస్తోందని విమర్శించింది. ఆ దేశ ప్రేరేపిత ఉగ్రవాదం వల్ల దక్షిణాసియా దేశాలు కూడా ప్రభావితమవుతున్నాయని పేర్కొంది.