: ఛాంపియన్స్ ట్రోఫీ: నేడు ఆత్మీయుల మధ్య సమరం!


ఛాంపియన్స్ ట్రోఫీలో నేడు ఆత్మీయుల సమరం జరగనుంది. టీమిండియాకు శ్రీలంక జట్టు సభ్యులు సన్నిహితంగా ఉంటారు. తమిళనాడుతో పలువురు లంకేయులు సంబంధ బాంధవ్యాలు కలిగి ఉండడంతో పాటు భారత్ కు సన్నిహితంగా ఉండడంతో ఈ రెండు జట్ల మధ్య సాన్నిహిత్యం ఎక్కువ. అంతే కాకుండా ఐసీసీలో బీసీసీఐకి పూర్తి మద్దతు ప్రకటించే దేశం కూడా శ్రీలంకే అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. విండీస్, సౌతాఫ్రికా బోర్డులు కూడా బీసీసీఐకి బేషరతు మద్దతు ప్రకటించే దేశాల్లో ముందుంటాయి. అయినప్పటికీ లంకేయులతో ఉన్న అనుబంధం వేరు. ఈ నేపథ్యంలో శ్రీలంక జట్టుతో టీమిండియా నేడు తలపడనుంది.

శ్రీలంక జట్టులో అపారమైన ప్రతిభ ఉంది. వ్యక్తిగతంగా ఒక్కో ఆటగాడు అద్భుతమైనప్పటికీ జట్టుగా రాణించడంలో లంకేయులు వెనుకబడిపోయారు. ప్రపంచ క్రికెట్ లో శ్రీలంకకు అర్జున రణతుంగ, అరవింద్ డిసిల్వా, జయసూర్య, రోషన్ మహనామా, కుమార ధర్మసేన తదితరులు తిరుగులేని గుర్తింపు తీసుకురాగా, వారి తరువాత ఆ జట్టును జయసూర్య, కుమార సంగక్కర, మహేళ జయవర్థనే, దిల్షాన్ ఆదుకున్నారు. చివరగా జయవర్థనే, సంగక్కర ఆట నుంచి నిష్క్రమించిన అనంతరం సంధికాలంలో లంక జట్టు కొనసాగుతోంది. పేరుకి జట్టు బలంగా కనిపిస్తున్నా...స్థాయికి తగ్గ ప్రదర్శన మాత్రం కరవవుతోంది.

ఇక టీమిండియా విషయానికి వస్తే... టైటిల్ ఫేవరేట్లలో ఒకటిగా కొనసాగుతోంది. డిఫెండింగ్ ఛాంపియన్ హోదాను నిలబెట్టుకునేందుకు స్థాయికి తగ్గ ఆటతీరు ప్రదర్శించేందుకు సిద్ధంగా ఉంది. బ్యాటింగ్, బౌలింగ్ వనరులు పుష్కలంగా ఉన్నాయి. ఫీల్డింగ్ లో యువకులతో కూడిన జట్టు మైదానంలో పాదరసంలా కదులుతోంది. జట్టులో సీనియర్ బ్యాట్స్ మన్ యువరాజ్ సింగ్ ఏమాత్రం బెరుకు లేకుండా ఆడుతున్నాడు. కీపింగ్ లో ధోనీకి తిరుగులేదు. కోహ్లీ వేగం పుంజుకుంటే ఆపడం అసాధ్యమన్న సంగతి తెలిసిందే. పాక్ తో మ్యాచ్ తో ఓపెనర్లు ధావన్, రోహిత్ ఆకట్టుకున్నారు. ఇక బౌలింగ్ విషయానికి వస్తే భువనేశ్వర్, ఉమేష్, బుమ్రా, షమి, పాండ్యతో పేస్ బౌలింగ్ విభాగం పటిష్ఠంగా ఉండగా, స్పిన్ బౌలింగ్ విభాగం అశ్విన్, జడేజాతో బలంగా ఉంది. ఆల్ రౌండ్ విభాగం హార్డిక్ పాండ్య, అశ్విన్, జడేజా, కేదార్ జాదవ్ తో బలంగా ఉంది. దీంతో మ్యాచ్ ఫేవరేట్ గా భారత్ బరిలో దిగుతుండగా, విజయం సాధించి, సెమీస్ రేసులో నిలిచేందుకు శ్రీలంక ఉవ్విళ్లూరుతోంది.

  • Loading...

More Telugu News