: ప్రారంభోత్సవ వేళ శిలాఫలకాన్ని ధ్వంసం చేసిన తెలుగు తమ్ముళ్లు... చంద్రగిరిలో ఉద్రిక్తత!
ప్రభుత్వ అధికారుల మధ్య సమన్వయ లోపం చిత్తూరు జిల్లా చంద్రగిరిలో ఉద్రిక్త పరిస్థితికి కారణమైంది. నేడు చంద్రగిరి ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీ నూతన భవనం ప్రారంభోత్సవం కాగా, ప్రొటోకాల్ వివాదం చెలరేగి అది తెలుగు తమ్ముళ్ల మధ్య వాగ్వాదానికి, అధికారులతో కొట్లాటకు కారణమైంది.
శిలాఫలకంలో టీడీపీ స్థానిక ప్రజా ప్రతినిధులు, పలువురు ఎంపీటీసీల పేర్లను అధికారులు చేర్చకపోగా, ఇదే విషయమై మొదలైన రగడ, చివరకు ఆ శిలాఫలకాన్ని నామరూపాల్లేకుండా ధ్వంసం చేసేంత వరకూ దారితీసింది. అధికారుల వైఖరిపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన టీడీపీ కార్యకర్తలు భవన ప్రారంభోత్సవ కార్యక్రమంలో రభస సృష్టించగా, పోలీసులు అక్కడకు చేరుకుని వారిని చెదరగొట్టారు. అందరి పేర్లనూ చేర్చి మరో శిలాఫలకాన్ని ఏర్పాటు చేయాల్సిందేనని స్థానిక నేతలు పట్టుబట్టారు. ఈ విషయమై మరింత సమాచారం వెలువడాల్సి వుంది.