: అలాంటి రోజులను ఎదుర్కోవడానికి నేనేమైనా అమ్మాయినా?: ఆస్కార్ విన్నర్ ఓలివర్ స్టోన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో పుతిన్
వ్లాదిమిర్ పుతిన్... రష్యా అధ్యక్షుడే అయినప్పటికీ, ఆఫీసు నుంచి ఇంటికి వెళ్తున్న వేళ సగటు పౌరుడిగానే ఓ ఉద్యోగిలా కనిపిస్తారు. సాధారణంగా ఉన్న ట్రాఫిక్ లో స్వయంగా కారును నడుపుకుంటూ వెళుతూ, తనపై డాక్యుమెంటరీ తీసే ఉద్దేశంతో వచ్చిన ఆస్కార్ గెలుచుకున్న దర్శకుడు ఓలివర్ స్టోన్ కు పుతిన్ ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూలో ఎడ్వర్డ్ స్నోడెన్ నుంచి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వరకూ ఆయన ప్రస్తావించారు. అమెరికా రాజ్య విస్తరణ కాంక్ష, డాక్టర్ స్ట్రాంజ్ లోవ్ డూమ్స్ డే సెటైర్లు వంటి వాటినెన్నో ప్రస్తావిస్తూ తన అభిప్రాయాలను వెల్లడించారు.
ఇటీవలి కాలంలో రాజకీయంగా ఇబ్బందులు ఎదురయ్యాయా? అన్న ప్రశ్నకు "అటువంటి రోజులను ఎదుర్కోవడానికి నేనేమీ అమ్మాయిని కాదు. నేను ఎవరినీ అవమానించడానికి ఇలా మాట్లాడటం లేదు. అది కేవలం సహజ చక్రమే. నా స్వభావమూ అంతే" అని కుండబద్దలు కొట్టినట్టు చెప్పారు.
తాను తొలిసారిగా స్నోడెన్ ను చైనాలో కలిశానని, అప్పట్లోనే ఆయనకు ఆశ్రయం ఇస్తానని చెప్పానని, అప్పట్లో అతను మానవ హక్కుల ఉల్లంఘనలపై పోరాటం సాగించాలని భావిస్తున్న వ్యక్తిగానే తనకు పరిచయమని పుతిన్ వ్యాఖ్యానించారు. శరీర కండరాలకు వ్యాయామం కోసం ఐస్ హాకీ ఆడటమంటే తనకు ఎంతో ఇష్టమని చెప్పిన ఆయన, ప్రతి రోజూ బరువులు ఎత్తుతానని, ఈత కూడా తన దైనందిన జీవితంలో భాగమని తెలిపారు.
కాగా, ఇంటర్వ్యూలో భాగంగా తన ఇంట్లో స్వయంగా పెంచుకుంటున్న 'జాన్నెస్ డిడిరిక్' అనే గుర్రానికి స్వయంగా కారెట్లు తినిపించారు పుతిన్. అయితే, మూడు సార్లు ఇంటర్వ్యూ చేసిన స్టోన్ మాత్రం, ఆయన చెప్పిన పలు విషయాలపై నిజానిజాలను నిర్థారించకుండానే ప్రసారం చేసేందుకు సిద్ధమైనట్టు విమర్శలు వస్తున్నాయి.