: మురికి వాడలో మొఘల్ యువరాణి... 6000 పింఛనుతో బతుకు వెళ్లదీస్తున్న వైనం!


'ఓడలు బళ్లు....బళ్లు ఓడలు' కావడం అంటే ఇదే.... దేశాన్ని ఏకఛత్రాధిపత్యంగా పాలించిన మొఘల్‌ చక్రవర్తుల వారసురాలు మాత్రం కోల్ కతాలోని ఓ మురికివాడలో అంత్యంత దీనస్థితిలో జీవనం వెళ్లబుచ్చుతోంది. మొఘలుల చివరి చక్రవర్తి బహదూర్ షా జఫర్ 1857లో బ్రిటిష్ వారిపై జరిగిన తిరుగుబాటుకు అనధికార నాయకత్వం వహించారు. ఈ సమయంలో తిరుగుబాటు సేనలు 57 మంది యూరోపియన్ సైనికుల్ని మొఘల్ ప్యాలెస్ లో బంధించి, హతమార్చాయి. ఈ తిరుగుబాటును సమర్థవంతంగా అణచివేసిన బ్రిటిషర్లు... జరిగిన ఘటనతో భహదూర్ షాకు ఎలాంటి సంబంధం లేకపోయినా అతనిని అరెస్టు చేసి, రంగూన్ జైలులో వేసి, జీవితాంతం అక్కడే ఉంచారు.

 ఈ సందర్భంగా ఆయన పరివారంలోని చాలా మంది హతం కాగా, అరెస్టైనవారిలో కొందరు తప్పించుకుని పరారయ్యారు. వారిలో బహదూర్ షా వారసురాలు కూడా ఉన్నారు. వారిలో బహదూర్ షా ముని ముని మనుమడైన మహ్మద్ బేదర్ భక్త్ మాత్రం భారత్ లోనే ఉండిపోగా, మిగిలినవారు అమెరికాలోని డెట్రాయిట్ తో పాటు, పాకిస్థాన్ లోను సెటిలయ్యారు. సుల్తానా బేగం అనే మహిళను బేదర్ భక్త్ వివాహం చేసుకుని ఇక్కడే ఉండిపోయాడు. ఆ దంపతులకు ఆరుగురు సంతానం. మొఘల్ రాజుల యువరాణి అయిన సుల్తానా బేగం ఇప్పుడు తన సంతానంతో కలసి కోల్ కతాలోని మురికివాడలో అత్యంత దీన స్థితిలో జీవితం వెళ్లదీస్తున్నారు. పట్టుపరుపులు, చీనీచీనాంబరాల మధ్య ఆడంబరంగా జీవించాల్సిన ఆమె ప్రభుత్వం ఇచ్చే 6000 రూపాయల పింఛనుతో రెండు గదుల ఇంట్లో నివాసం ఉంటున్నారు.

 గతంలో బేదర్ భక్త్ టీ స్టాల్ నడిపినప్పటికీ దానిని మూసేయడంతో ప్రభుత్వం ఇస్తున్న పింఛనే ఆధారంగా మారింది. తన భర్త మరణంతో దయనీయంగా మారిన తమను ఆదుకోవాలని కోరుతూ, తన వారసత్వ వివరాలు చెబుతూ ఏఐసీసీ చీఫ్ సోనియా గాంధీకి ఆమె ఒక లేఖ రాశారు. దీంతో 2003లో కేంద్ర ప్రభుత్వం ఆమెకు 50 వేల రూపాయలు, ఒక అపార్ట్‌ మెంట్‌, పింఛన్‌ మంజూరు చేసింది. అయితే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఫ్లాట్ నుంచి గూండాలు ఆమెను వెళ్లగొట్టారు. దీంతో ఆమె వీధుల పాలయ్యారు.మరోసారి ప్రభుత్వ సహాయం కోసం ఎదురు చూస్తున్న ఆమె.... తన తాతముత్తాలు కట్టిన తాజ్‌ మహల్‌, ఎర్రకోట వంటి టూరిస్టు ప్రదేశాల వీక్షణకు డబ్బులు వసూలు చేస్తూ ప్రభుత్వం కోట్లు ఆర్జిస్తోందని... తనకు భోగభాగ్యాలు అందించకపోయినా ఫర్వాలేదని... అయితే కడు పేదరికం నుంచి బయటపడేయాలని మాత్రం కోరుతున్నానని ఆమె వేడుకుంటోంది.

  • Loading...

More Telugu News