: ఏపీ రైతులకు శుభవార్త... నైరుతి రుతుపవనాలు వచ్చేశాయి!: వాతావరణ శాఖ


ఆంధ్రప్రదేశ్ రైతులకు వాతావరణ శాఖాధికారులు శుభవార్త చెప్పారు. నైరుతి రుతుపవనాలు తెలుగు రాష్ట్రాలను ముందుగానే పలకరించాయని తెలిపారు. ఈ రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయని, వీటి కదలికలను బట్టి చూస్తే రానున్న మూడు లేదా నాలుగు రోజులపాటు ఇవి విస్తరిస్తాయని అన్నారు. గతంలో అంచనా వేసినట్టే పశ్చిమ దిశ, నైరుతీ దిశ నుంచి వీచే గాలుల తీవ్రత కారణంగా ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాదు వాతావరణ కేంద్రం తెలిపింది.

వచ్చే ఐదు రోజులు రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఒడిశా, కోస్తాంధ్ర మీదుగా తమిళనాడు వరకు అల్పపీడన ద్రోణి కొనసాగుతోందని వారు చెప్పారు. అలాగే, పశ్చిమ మధ్య బంగాళాఖాతాన్ని కలుపుతూ ఒడిశా నుంచి ఉత్తరకోస్తా మీదుగా సముద్రమట్టానికి 3.1 కిలోమీటర్ల నుంచి 3.6 కిలోమీటర్ల ఎత్తు మధ్య ఒక ఉపరితల ఆవర్తనం కొనసాగుతుండగా, తూర్పు మధ్య బంగాళాఖాతంలో అండమాన్‌ సముద్రాన్ని కలుపుతూ సముద్రమట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తులో మరొక ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని వారు తెలిపారు. వీటి ప్రభావంతో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వారు సూచించారు. సకాలంలో వర్షాలు కురుస్తుండడం పట్ల రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

  • Loading...

More Telugu News