: ఓ భర్త కిరాతకం: సెల్‌ఫోన్ అడిగినందుకు.. గర్భిణి భార్యను రెండంతస్తుల నుంచి కిందికి తోసేశాడు!
బీహార్‌లో దారుణం చోటుచేసుకుంది. తల్లిదండ్రులతో మాట్లాడేందుకు సెల్‌ఫోన్ అడిగిన నిండు గర్భిణి అయిన భార్యను రెండో అంతస్తు నుంచి తోసేశాడో కిరాతక భర్త. ఈ ఘటనలో ఆమె కాళ్లు విరిగిపోగా, గర్భంలోని శిశువు మృతి చెందింది. దర్భంగా జిల్లాలోని మంజిహోరా గ్రామానికి చెందిన బబితదేవి (28), ఠాకూర్ భార్యాభర్తలు. ఇంటి డాబాపై ఠాకూర్ ఫోన్ మాట్లాడుతుండగా, తన తల్లిదండ్రులకు ఫోన్ చేసుకునేందుకు ఓసారి మొబైల్ ఇవ్వాలని బబిత కోరింది. దీంతో కోపోద్రిక్తుడైన ఠాకూర్ ఆమెను అక్కడి నుంచి కిందికి తోసేశాడు. కింద పడిన ఆమెను వెంటనే దర్భంగలోని ఆర్బీ మెమోరియల్ ఆస్పత్రికి తరలించారు.
ఆమె కాళ్లు విరిగిపోగా గర్భంలో పెరుగుతున్న ఏడు నెలల శిశువు మరణించింది. ఆమె పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. ఆపరేషన్ చేసి మృతి చెందిన శిశువును తొలగించారు. మరో మూడు రోజులు గడిస్తే కానీ బబిత విషయం చెప్పలేమన్నారు. బబిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఠాకూర్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే మొబైల్ కోసం గొడవ అనంతరం బిల్డింగ్ పైనుంచి ఆమే దూకేసిందని ఠాకూర్ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నట్టు ఏఎస్పీ దిల్‌నవాజ్ అహ్మద్ తెలిపారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్టు పేర్కొన్నారు.