: రేపు సెనేట్ కమిటీ ముందుకు ఎఫ్బీఐ మాజీ డైరెక్టర్... మీడియా సంస్థల లైవ్ కవరేజి!


అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ రేపు అగ్నిపరీక్షను ఎదుర్కోనున్నారు. ఎఫ్బీఐ డైరెక్టర్ పదవి నుంచి ట్రంప్ తొలగించిన జేమ్స్ కోమీ రేపు వాషింగ్టన్‌ లో సెనెట్‌ ఇంటెలిజెన్స్‌ కమిటీ ముందు విచారణకు హాజరుకానున్నారు. జేమ్స్ కోమీని సెనేటర్లు ప్రశ్నించనున్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రమాణం చేసి సమాధానాలు చెబుతారు. భారత కాలమానం ప్రకారం రాత్రి 7:30 నిమిషాలకు ఆయన సెనెటర్ల ముందు విచారణకు కూర్చుంటారు. దీనిని ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు మీడియా సంస్థలు అన్ని ఏర్పాట్లు చేశాయి.

ఈ సందర్భంగా జేమ్స్ కోమీని సెనెటర్లు అడిగే ప్రశ్నలేంటంటే.... ఫ్లిన్‌ పై విచారణలో వెనక్కి తగ్గాల్సిందిగా అధ్యక్షుడు మీపై ఒత్తిడి తెచ్చారా?... అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రష్యా జోక్యం చేసుకుంటే దానిలో మైఖేల్ ఫ్లిన్‌ పాత్రేమిటి?.... ట్రంప్‌ ను మీరు ఎప్పుడు కలిశారు? ఆ సందర్భంలో ఏం మాట్లాడారు?.... తనకు విధేయుడిగా ఉండాలని అధ్యక్ష పదవి చేపట్టిన అనంతరం ట్రంప్‌ మిమ్మల్ని అడిగారా?... రష్యా జోక్యంపై విచారణలో ట్రంప్‌ పాత్రపై విచారణ జరగడం లేదని మీరు ఆయనకు చెప్పారా? వంటి ప్రశ్నలు సంధించనున్నారు. ఈ ప్రశ్నలకు జేమ్స్ కోమీ చెప్పే సమాధానాలు ట్రంప్ భవితవ్యాన్ని నిర్ణయించనున్నాయి.

అయితే అధ్యక్షుడ్ని ఇబ్బంది పెట్టడం మంచిది కాదని కోమీ భావిస్తే... ఈ విషయంలో జరుగుతున్న దర్యాప్తుపై తన సమాధానాలు ప్రభావితం చూపిస్తాయని సాకు చెప్పి, రష్యా జోక్యం గురించి మాట్లాడేందుకు నిరాకరించవచ్చు. అలా కాకుండా ఫ్లిన్ ను కాపాడేందుకు ట్రంప్ ప్రయత్నించారని ఆయన పేర్కొంటే మాత్రం అమెరికా రాజకీయాల్లో పెనుమలుపు తప్పదు. ట్రంప్ ను అభిశంసన ద్వారా తొలగించాలనే డిమాండ్ పెరుగుతుంది. ఈ విచారణ వల్ల ఆయనకు ఎలాంటి నష్టం వాటిల్లకపోయినా.. ఇప్పటికే అధ్యక్ష ఎన్నికల్లో రష్యా జోక్యం, ట్రంప్‌ బృందానికి క్రెమ్లిన్‌ తో ఉన్న సంబంధాలపై విచారణకు ఎఫ్‌బీఐ మాజీ డైరెక్టర్‌ రాబర్ట్‌ ముల్లర్‌ ఆధ్వర్యంలో మే 17న ప్రత్యేక కౌన్సిల్‌ ను ఏర్పాటు చేశారు. రాబర్ట్ ముల్లర్ దర్యాప్తులో ఇవే వాస్తవాలు వెలుగు చూస్తే మాత్రం ట్రంప్ కు పదవీ గండం ఉన్నట్టే!

  • Loading...

More Telugu News