: మూడు కీలక వికెట్లు కోల్పోయిన సఫారీలు... ఆకట్టుకుంటున్న పాక్ బౌలర్లు!
సౌతాఫ్రికాతో జరుగుతున్న మ్యాచ్ లో పాకిస్థాన్ బౌలర్లు ఆకట్టుకుంటున్నారు. ఎన్నో అంచనాలతో బ్యాటింగ్ ఆరంభించిన సఫారీలను పాక్ పేసర్లు కట్టుదిట్టమైన బంతులతో పరుగులు సాధించకుండా అడ్డుకున్నారు. చక్కని లైన్ అండ్ లెంగ్త్ తో పేసర్లు, స్పిన్నర్లు ఆకట్టుకున్నారు. దీంతో ఓపెనర్లు క్వింటన్ డికాక్ (33), హషీమ్ ఆమ్లా (16) పరుగులు చేసేందుకు ఇబ్బంది పడ్డారు. 40 పరుగుల వద్ద ఆమ్లాను ఇమాద్ ఎల్బీడబ్ల్యూగా బలిగొన్నాడు. దీంతో పరుగుల వేగం మందగించింది.
అనంతరం డికాక్ కు డివిలీర్స్ జతకలిశాడు. 60 పరుగుల వద్ద డికాక్ ను మహ్మద్ హఫీజ్ ఎల్బీడబ్ల్యూగా అవుట్ చేశాడు. తరువాతి ఓవర్ లో ఇమాద్ వసీం వైడ్ గా వేసిన బంతిని అంచనా వేయడంలో పొరబడ్డ డివిలిర్స్ (0) థర్డ్ పాయింట్ లో ఫీల్డింగ్ చేస్తున్న హఫీజ్ కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ కు చేరాడు. దీంతో కేవలం 15 ఓవర్లలో 62 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన సఫారీలు ఇబ్బందుల్లో పడ్డారు. క్రీజులో డుప్లెసిస్ (9) కు డేవిడ్ మిల్లర్ (2) జతకలిశాడు.