: ఇండియాపై ఓడిపోవడానికి కారణాన్ని వివరించిన పాక్ కెప్టెన్!
ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ తో జరిగిన మ్యాచ్ లో ఘోర ఓటమిని మూటగట్టుకోవడంపై పాకిస్థాన్ కెప్టెన్ సర్ఫరాజ్ స్పందించాడు. తమ జట్టులోని చాలా మంది ఆటగాళ్లు తొలిసారి భారత్ పై ఆడారని... ఇండియాతో మ్యాచ్ అనగానే చాలా మంది తీవ్ర ఒత్తిడికి గురయ్యారని చెప్పాడు. భారత్ తో మ్యాచ్ అంటే తమకు పెద్ద యుద్ధం లాంటిదేనని... ఈ నేపథ్యంలోనే యువ ఆటగాళ్లు తీవ్ర ఆందోళనకు గురయ్యారని తెలిపాడు. ఈ ఒత్తిడిలోనే అందివచ్చిన అవకాశాన్ని దుర్వినియోగం చేసుకున్నారని చెప్పాడు.
ఆటగాళ్లు ఒత్తిడికి లోను కాకుండా ఉండేందుకు తాము చాలా ప్రయత్నించామని... ఉదయమే ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకుని, మైదానంలో అమలు చేయాల్సిన వ్యూహంపై చర్చించామని సర్ఫరాజ్ తెలిపాడు. అయితే, ఈ ప్రణాళికలను గ్రౌండ్ లో అమలు చేయడంలో విఫలమయ్యామని చెప్పాడు. క్యాచ్ లు వదిలేయడం, మిస్ ఫీల్డింగ్ తమను బాగా దెబ్బతీశాయని తెలిపాడు. ఫీల్డింగ్ బాగా చేసుంటే పరిస్థితి మరోలా ఉండేదని అన్నాడు. భారత్ తో మ్యాచ్ అనంతరం తమ ఆటగాళ్లు డీలా పడినప్పటికీ... ప్రస్తుతం అంతా సర్దుకుందని చెప్పారు. మిగిలిన మ్యాచ్ ల పైనే ప్రస్తుతం తాము దృష్టిని కేంద్రీకరించామని తెలిపాడు.