: జగన్ ఛాంబర్‌లోని ఏసీ పైపును కట్ చేశారు.. ఆ పని ఎవరు చేశారో సీఐడీ విచారణలో తేలుతుంది!: స్పీకర్ కోడెల
నిన్న అమరావతిలో కురిసిన వర్షం ధాటికి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ప్రాంగణంలోని వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఛాంబర్‌లోకి నీరు వచ్చిన విషయం తెలిసిందే. కొత్తగా నిర్మించిన ఆ భవనంలోకి నీరు వచ్చిన అంశాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోంది. ఈ రోజు వైఎస్ జగన్ ఛాంబర్‌ని పరిశీలించిన ఏపీ సభాపతి కోడెల శివప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ... ఆ ఛాంబర్‌లోకి నీరు ఎలా వచ్చిందో, దానికి ఎవరు బాధ్యులో తెలుసుకునేందుకు సీఐడీ విచారణకు ఆదేశించామని తెలిపారు. ఈ అసెంబ్లీ భవనం ప్రారంభించి నాలుగు నెలలైందని, ఇందులో అసెంబ్లీ సమావేశాలు, ప్రత్యేక సమావేశాలు కూడా జరిగాయని అన్నారు. ఆ సమయంలోనూ భారీ వర్షం పడిందని, అనంతరం కూడా వర్షాలు పడ్డాయని తెలిపారు. కానీ, నిన్న కురిసిన వర్షానికి మాత్రమే జగన్ ఛాంబర్‌లోకి నీళ్లు వెళ్లాయని, దీనిపై ఎన్నో విమర్శలు వస్తున్నాయని అన్నారు.
భవన నిర్మాణం సరిగ్గా జరగలేదని, అధికారులు శ్రద్ధ తీసుకోవడంలేదని విమర్శిస్తూ కొందరు ఎమ్మెల్యేలు ఈరోజు ధర్నా చేశారని కోడెల వ్యాఖ్యానించారు. అసెంబ్లీ సమావేశాలు జరగని రోజుల్లో కేవలం ఎమ్మెల్యేలు, అధికారులు మాత్రమే ఈ భవనం ప్రాంగణానికి వస్తారని, మిగతావారికి అనుమతి ఉండబోదని కోడెల తెలిపారు. నిన్న జగన్ ఛాంబర్‌లోకి నీళ్లు రావడంపై అధికారులు వెంటనే జాగ్రత్తలు తీసుకున్నారని అన్నారు. ఈ అంశాన్ని విచారించగా ఎవరో కావాలనే పైప్‌ను కట్‌చేసినట్టు తెలిసిందని అన్నారు. అందుకే ఛాంబర్‌లోకి నీళ్లు వచ్చాయని పేర్కొన్నారు. ఈ విషయాన్ని రాద్ధాంతం చేసి ప్రభుత్వ భవనాలు బాగోలేవంటూ ఆరోపణలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. జగన్ ఛాంబర్‌లోని ఏసీ పైపు కట్ అయిందని, దాన్ని ఎవరు కట్ చేశారో విచారణలో తేలుతుందని స్పీకర్ చెప్పారు.