: మన్మోహన్ సింగ్ సినిమా.. ఫస్ట్ లుక్ విడుదల!
మాజీ ప్రధాని మన్మోహన్ చిత్రం 'ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్' ఫస్ట్ లుక్ విడుదలైంది. ఎంతో ఆసక్తికరంగా ఉన్న ఈ పోస్టర్ అందర్నీ ఆకట్టుకుంటోంది. పోస్టర్ లో... ఓ వైపుకు మన్మోహన్ సింగ్ తిరిగి ఉండగా... ఆయన ఫొటో బ్యాక్ గ్రౌండ్ లో ఓ మహిళ చీర కట్టుకుని నిలబడి ఉన్నారు. ఆమె అచ్చం సోనియాగాంధీలా ఉన్నారు.
మన్మోహన్ మాజీ మీడియా సలహాదారు సంజయ్ బారు రచించిన 'ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్' పుస్తకం ఆధారంగా ఈ సినిమాను నిర్మించారు. 2014 సాధారణ ఎన్నికల సమయంలో ఈ పుస్తకం విడుదలైంది. మే 2004 నుంచి ఆగస్ట్ 2008 వరకు మన్మోహన్ సలహాదారుగా సంజయ్ బారు వ్యవహరించారు. మన్మోహన్ సింగ్ ను అచేతనుడిని చేశారంటూ తన పుస్తకంలో బారు ఆరోపించారు. అత్యంత కీలకమైన నియామకాలు, నిర్ణయాలను ప్రధాని మన్మోహన్ బదులు సోనియాగాంధీనే తీసుకున్నారని పేర్కొన్నారు.
ఈ సినిమాలో మన్మోహన్ సింగ్ పాత్రలో ప్రముఖ బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ నటించారు. 2019 సాధారణ ఎన్నికలకు ముందు 2018 డిసెంబర్ లో ఈ సినిమాను విడుదల చేయాలని భావిస్తున్నారు. ఈ సినిమా గురించి చిత్ర నిర్మాత సునీల్ బోహ్రా మాట్లాడుతూ, రిచర్డ్ అటెన్ బరో నిర్మించిన 'గాంధీ' సినిమా కంటే ఇది ఇంకా గొప్పగా ఉంటుందని చెప్పారు.
ఫస్ట్ లుక్ రిలీజ్ సందర్భంగా అనుపమ్ ఖేర్ తన స్పందనను ట్విట్టర్ ద్వారా తెలిపారు. "నటుడిగా మళ్లీ తనను తాను ఆవిష్కరించుకోవడం పెద్ద ఛాలెంజ్" అని తెలిపారు. 'ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్' సినిమాలో మన్మోహన్ పాత్రలో ఒదిగిపోవడానికి ప్రయత్నిస్తున్నానని చెప్పారు.