: హీరోయిన్ అవంతిక ఆవేదన... కన్నడ నిర్మాత సురేష్ వేధించాడని ట్విట్టర్ లో సంచలన ఆరోపణలు!
చిత్ర పరిశ్రమలో వేధింపులు సాధారణమంటున్న హీరోయిన్ల జాబితాలో మరో నటి చేరిపోయింది. కన్నడ హీరోయిన్ అవంతిక తన ట్విట్టర్ ఖాతాలో ఈ విషయాన్ని పోస్ట్ చేసింది. "ఆర్ ఉమెన్ రియల్లీ సేఫ్ ఇన్ ది ఫిల్మ్ ఇండస్ట్రీ?" అనే టైటిల్ తో ఓ పెద్ద లేఖను పోస్టు చేసింది. తాను చూసిన నిజాలను జీర్ణం చేసుకున్నానని చెబుతూ, నిస్సహాయురాలినైన తాను పరిశ్రమలో బాధితురాలిగా మిగిలానని వాపోయింది. తాను గతంలో ఉపేంద్ర హీరోగా నటించిన 'రాజారథ', డాక్టర్ రాజేంద్ర నిర్మించిన 'కల్పన-2'లో నటించిన సమయంలో ఎంతో గౌరవాన్ని పొందానని, ప్రముఖ నిర్మాత సురేష్ తో 'రాజు కన్నడ మీడియం' చిత్రానికి (ఇంకా విడుదల కాలేదు) సంతకం చేసిన సమయంలో తనకు ఎదురైన అనుభవాలను సాధ్యమైనంత త్వరగా మరచిపోవాలని భావిస్తున్నట్టు తెలిపింది.
తొలి షెడ్యూల్ నుంచే తనకు సమస్యలు ఎదురయ్యాయని వాపోయింది. చిత్రంలో తన నటన బాగాలేదని నిత్యమూ వేధించారని, ఎంతో రిహార్సల్స్ చేసి సెట్ కు వచ్చే తనకు నిర్మాత నుంచి కూడా తిట్లు ఎదురయ్యాయని తెలిపింది. సినిమాలో తన క్యారెక్టర్ నిడివిని తగ్గించారని, తనకిచ్చిన చెక్కు కూడా బౌన్స్ అయిందని తెలిపింది. విషయాన్ని సామరస్యంగా పరిష్కరించుకుందామని తాను చేసిన ప్రయత్నాలు విఫలం అయ్యాయని చెప్పింది. తన పాత్రకు వేరే వారితో డబ్బింగ్ చెప్పించారని, తన ప్రవర్తనపై తప్పుడు ఆరోపణలు చేశారని ఆరోపించింది. తనకు చెడ్డపేరు తేవాలని నిర్మాత సురేష్ ప్రవర్తించాడని, అందుకు కారణం ఏంటో తనకు తెలుసునని చెప్పింది. జరిగిన విషయం తెలుసుకునేందుకు మీడియా తరచూ తనను సంప్రదించిందని, ఈ వివాదంలోకి నిర్మాతను లాగడం ఇష్టం లేకనే ఇన్ని రోజులూ వేచి చూశానని, మరో హీరోయిన్ ఈ తరహా పరిస్థితిని ఎదుర్కోరాదన్న భావనతోనే ఇలా సోషల్ మీడియాలో తన అనుభవాన్ని ఉంచుతున్నానని చెప్పుకొచ్చింది.