: ఏపీ అసెంబ్లీలోకి మీడియాకు నో ఎంట్రీ... వైకాపా ఎమ్మెల్యేల ధర్నా!
నిన్న కురిసిన వర్షానికి అమరావతి అసెంబ్లీలో విపక్ష నేత జగన్ కార్యాలయం సహా పలు గదుల్లోకి వర్షం నీరు చేరడంపై నిజనిర్ధారణకు వైకాపా ఎమ్మెల్యేలు వెళ్లిన వేళ, మీడియాను లోపలికి అనుమతించకపోవడం వివాదాస్పదమైంది. పలు పత్రికలు, టీవీ చానళ్ల ప్రతినిధులతో పాటు లోపలికి వెళ్లాలని వైకాపా భావించగా, మార్షల్స్ వారిని అడ్డుకున్నారు. కేవలం ఎమ్మెల్యేలు మాత్రమే లోపలికి వెళ్లవచ్చని స్పష్టం చేశారు. దీంతో అసెంబ్లీ గేటు ముందు ఆందోళనకు దిగిన వైకాపా శాసనసభ్యులు తమతో పాటు మీడియానూ అనుమతించాలని పట్టుబట్టారు. చిన్నపాటి వానకే వందల కోట్లతో నిర్మించిన భవనాల్లోకి నీరు చేరడంపై ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన ఎమ్మెల్యేలు, భవనాల నిర్మాణంలో అవకతవకలు జరిగాయని, వాటిపై ప్రజలకు నిజాలు తెలియాల్సిన అవసరం ఉందని అన్నారు.