: అదేంటో ఇంతవరకు ఐసీసీకి కూడా అర్థం కాలేదు!: 'డక్ వర్త్ లూయిస్'పై ధోనీ సెటైర్


ఇంగ్లండ్ లో జరుగుతున్న ఛాంపియన్స్ ట్రోఫీపై వరుణుడు పంజా విసురుతున్నాడు. వర్షం కారణంగా ఇప్పటికే పలు మ్యాచ్ లు రద్దయ్యాయి. రద్దయిన మ్యాచ్ లకు రిజర్వ్ డేలు కూడా లేకపోవడంతో... పలు జట్ల తలరాతలు తలకిందులవుతున్నాయి. మరికొన్ని మ్యాచ్ లకు వరుణుడు మధ్య మధ్యలో ఆటంకం కలిగిస్తున్నాడు. దీంతో, డక్ వర్త్ లూయిస్ నిబంధనల ప్రకారం... లక్ష్యాలను నిర్దేశిస్తున్నారు. ఈ నిబంధనలు చాలా సంక్లిష్టంగా ఉండటం చాలా ఇబ్బందికరంగా మారింది. క్రికెట్ అభిమానులే కాదు... జట్టు కెప్టెన్లకు కూడా డక్ వర్త్ లూయిస్ లెక్కలు అర్థంకావడం లేదు.

సోమవారం నాడు విరాట్ కోహ్లీ ఛారిటీకి సంబంధించిన విందు కార్యక్రమం జరిగిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి టీమిండియా సభ్యులంతా హాజరయ్యారు. ఈ సందర్భంగా డక్ వర్త్ లూయిస్ నిబంధనలపై స్పందించాలంటూ టీమిండియా మాజీ కెప్టెన్ ధోనీని ఓ మీడియా ప్రతినిధి కోరాడు. "చాలా కాలంగా మీరు క్రికెట్ ఆడుతున్నారు. మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నా. డక్ వర్త్ లూయిస్ మీకు అర్థమయిందా?" అంటూ ధోనీని అడిగాడు. దీనికి తనదైన శైలిలో ధోనీ సమాధానమిచ్చాడు. ఐసీసీకి కూడా డక్ వర్త్ లూయిస్ అర్థంమయిందని తాను భావించడం లేదని నవ్వుతూ ధోనీ చెప్పాడు.

  • Loading...

More Telugu News