: సంచలనం... కేరళ ఏటీఎం దోపిడీ గ్యాంగ్ బాస్ ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్!


ఢిల్లీ పోలీస్ విభాగం క్రైమ్ బ్రాంచ్ లో ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ గా ఉండి, గత ఆరు నెలల నుంచి మాయమైన అధికారి అస్లుప్ ఖాన్ ఆచూకీ కోసం తీవ్రంగా శ్రమించిన పోలీసులు దిగ్భ్రాంతి కలిగే వాస్తవాలను వెలుగులోకి తెచ్చారు. కేరళలో బ్యాంకులు, ఏటీఎంల దోపిడీ ముఠా వెనుక ఖాన్ మాస్టర్ మైండ్ వుందని, వారికి బాస్ గా వ్యవహరిస్తూ, ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటకల్లోనూ దోపిడీలకు తెగబడ్డాడని, అతని ఆచూకీ కోసం రంగంలోకి దిగిన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ కనుగొంది. ఈ గ్యాంగులో సభ్యుడైన సురేష్ (37) అనే వ్యక్తిని ఢిల్లీలోని కస్తూర్బా గాంధీ మార్గ్ లో అరెస్ట్ చేసి విచారించగా, మొత్తం వ్యవహారం వెలుగులోకి వచ్చింది. గత సంవత్సరం డిసెంబర్ 15 నుంచి నెల రోజుల సెలవుపై వెళ్లిన అస్లుప్ ఖాన్, తరువాత మరో నెల రోజులు తన సెలవును పొడిగించుకున్నాడు. దీంతో క్రమశిక్షణా చర్యల్లో భాగంగా అతన్ని సస్పెన్షన్ లో పెట్టారు.

ఇక పోలీసుల విచారణలో సురేష్ చెప్పిన వివరాల ప్రకారం, ఓ ఇన్ ఫార్మర్ గా ఖాన్ ను కలుసుకోగా, దోపిడీ గ్యాంగులో సభ్యుడిని చేశాడు. ఆపై కేరళలోని చెరియనాడు, కళకూట్టం, రామాపురం, కంజికుజ్ తదితర ప్రాంతాల్లోని ఏటీఎంలను ఈ గ్యాంగ్ దోచుకుంది. కేరళలోని మారుమూల ప్రాంతాల్లో, సెక్యూరిటీ లేని ఏటీఎంలను గుర్తించడం సురేష్ పని. ఆపై ఖాన్ తో కలసి బృందం సభ్యులు దోపిడీ తరువాత ఎలా తప్పించుకోవాలన్న విషయమై ప్రణాళికను రూపొందించేవాడు. ఏటీఎంకు సమీపంలోని హోటల్ లో బస చేసి, జనసంచారం తగ్గిన తరువాత తమ పని కానిచ్చి వెళ్లిపోతుంటారు. ఏటీఎంలలోని సీసీటీవీ కెమెరాల్లో తమ ముఖం కనిపించకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. తప్పుడు నంబర్ ప్లేట్లు బిగించిన వాహనాలనే వాడతారు. ఇక ఖాన్ ఆచూకీ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నామని, అతన్ని త్వరలోనే అరెస్ట్ చేస్తామని పోలీసు అధికారి ఒకరు తెలిపారు.

  • Loading...

More Telugu News