: ట్రాక్టర్ ను ముందుకు దూకించిన పెంపుడు శునకం... బడా కోటీశ్వరుడి మృతి
డెరెక్ మేడ్ (70)... ఓ రియల్ ఎస్టేట్ డెవలపర్. యూకే లోని సోమర్ సెట్ లో స్థానిక కౌన్సిలర్. వందల ఎకరాల సాగు పనులను స్వయంగా పరిశీలించే రైతు కూడా. అతని పెంపుడు శునకం ప్రమాదవశాత్తూ, ఇంజన్ ఆన్ లో ఉన్న ట్రాక్టర్ గేర్ ను వేయడంతో అది ముందుకు కదలగా ఆయన చనిపోయారు. 'టెలిగ్రాఫ్' అందించిన వివరాల ప్రకారం, భారీ యంత్ర పరికరాల రవాణాకు ఉపయోగించే జేసీబీ ఫార్మ్ లోడర్ క్యాబిన్ లోకి డెరెక్ పెంపుడు శునకం ప్రవేశించింది. ఆ సమయంలో దాని ముందు డెరెక్ ఉన్నారు. జేసీబీ ముందుకు దూకడంతో దాని కింద చిక్కుకుని ఆ వెంటనే గుండెపోటుతో మరణించారు. సమాచారం అందుకున్న పోలీసులు, ఎయిర్ ఆంబులెన్స్ అక్కడకు చేరుకుని ఆయన్ను కాపాడేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. డెరెక్ కుటుంబం ఆరు శతాబ్దాలుగా సోమర్ సెట్ ప్రాంతంలో వ్యవసాయం చేస్తున్నదని, ఆయన మరణం తమకెంతో లోటని ఇక్కడి స్థానికులు చెబుతున్నారు.