: నాపై కుట్ర పూరితంగా కేసులు నమోదు చేశారు: తహసీల్దార్ శంకరరావు
తనపై కుట్ర పూరితంగా కేసులు నమోదు చేశారని అక్రమాస్తుల ఆరోపణలు ఎదుర్కొంటున్న తహసీల్దార్ మజ్జి శంకరరావు ఆరోపించారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, అనారోగ్య కారణంగా ఆసుపత్రిలో చికిత్స చేయించుకుంటున్నానని, తానేమీ అజ్ఞాతంలోకి వెళ్లలేదని, పోలీసులు తనను సంప్రదించలేదని చెప్పారు. రుషికొండలో విలువైన భూములు అన్యాక్రాంతమయ్యాయని, తాను తహసీల్దార్ గా బాధ్యతలు చేపట్టాక ఈ విషయాన్ని, అందుకు సంబంధించిన వివరాలను అధికారుల దృష్టికి తీసుకువెళ్లానని చెప్పారు. తన కంటే ముందు పని చేసిన తహసీల్దార్ల హయాంలోనే భూ కుంభకోణాలు జరిగాయని, వారిని విచారిస్తే మరిన్ని నిజాలు వెలుగు చూస్తాయని అన్నారు. కాగా, విశాఖలోని శంకరావు నివాసంలో, ఆయన బంధువుల ఇళ్లలో అవినీతి నిరోధక శాఖ తనిఖీలు కొనసాగుతున్నాయి.