: ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి భూ కుంభకోణాల చరిత్ర!


భూ కుంభకోణాలకు పాల్పడ్డారంటూ ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏపీ టీడీపీ ఎమ్మెల్సీ దీపక్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆయన పాల్పడిన భూ కబ్జాల వివరాలు..

* హైదరాబాద్ లో దశాబ్దాల క్రితం నివాసమున్న అయూబ్ కమల్ అనే శరణార్థికి చెందిన బంజారాహిల్స్ లోని 3.37 ఎకరాల భూమిని, 1960లో ఎంవీఎస్ చౌదరి అండ్ బ్రదర్స్ కొనుగోలు చేశారు. అయితే, 2008లో ఆ భూమిని అక్బర్ మొహినుద్దీన్ అన్సారీ, ఖాజా మొహినుద్దీన్ అన్సారీ అనే వ్యక్తులు కొనుగోలు చేశారని దీపక్ రెడ్డి తరపు న్యాయవాది శైలేష్ సక్సేనా తప్పుడు పత్రాలు సృష్టించాడు. ఆ భూమిని వారి నుంచి దీపక్ రెడ్డి కొనుగోలు చేసినట్టు తప్పుడు పత్రాలను తయారు చేశారు. తమ భూమిని ఎంవీఎస్ చౌదరి అండ్ బ్రదర్స్ కబ్జా చేశారంటూ భూ కబ్జా నిరోధక కోర్టులో న్యాయవాది శైలేష్ ఫిర్యాదు చేశారు. అయితే, ఈ కేసు విచారణలో ఉండగా, కొన్ని నెలల క్రితం చౌదరి తరఫు ప్రతినిధి, రెవెన్యూ అధికారులు ధ్రువీకరించిన అసలు పత్రాలను ఆ కోర్టులో సమర్పించారు. ఆ తర్వాత బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో చౌదరి తరపు ప్రతినిధి ఫిర్యాదు చేయడంతో ఈ కేసును సీసీఎస్ కు బదిలీ చేశారు. న్యాయవాది శైలేష్ సహా దీపక్ రెడ్డిపై కేసు నమోదు చేశారు.

* అసిఫ్ నగర్ లో మొత్తం రూ.165 కోట్ల విలువ చేసే భూములను అక్రమంగా సొంతం చేసుకునేందుకు న్యాయవాది శైలేష్ పథక రచన చేయగా, దీపక్ రెడ్డి ఆర్థిక సహకారం అందించారు. అసిఫ్ నగర్ లో ఓ సొసైటీకి చెందిన భూమి తమదేనంటూ సుమారు ఏడేళ్ల క్రితం శైలేష్ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. అయితే, ఈ కేసు విచారణ కొనసాగుతుండగానే, ప్రభుత్వానికి చెందిన వంద ఎకరాల భూమిని నిజాం నవాబ్ తమకు ఇనాంగా ఇచ్చారంటూ కోర్టుకు కొన్ని పత్రాలను శైలేష్ సమర్పించారు.

ఈ క్రమంలో సొసైటీ సభ్యులు అసలు పత్రాలను న్యాయస్థానానికి సమర్పించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. సొసైటీ భూములు శైలేష్ వి కావని పోలీసుల ప్రాథమిక ఆధారాల్లో తేలింది. శైలేష్ పై పోలీసులు కేసు నమోదు చేయడంతో ఆయన పారిపోయాడు. ఈ నేపథ్యంలో శైలేష్ ను సొసైటీ సభ్యులు అపహరించారంటూ తాడిపత్రి పోలీస్ స్టేషన్ లో దీపక్ రెడ్డి గతంలో ఫిర్యాదు చేయడం, ఆ విషయం అవాస్తవమని పోలీసుల విచారణలో తేలడం జరిగింది. చౌదరి బ్రదర్స్ ఇంటికి వెళ్లి వారిని బెదిరించడం, పోలీసుల విచారణలో దురుసుగా వ్యవహరించడం వంటి కేసులు దీపక్ రెడ్డి పై గతంలో నమోదయ్యాయి.

  • Loading...

More Telugu News