: మన్మోహన్ సింగ్ రాజకీయ జీవితం ఆధారంగా సినిమా?
మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ జీవితకథ ఆధారంగా ఓ సినిమా తెరకెక్కనుంది. మన్మోహన్ ప్రధాన మంత్రిగా ఉన్న సమయంలో కొన్ని ఘట్టాలను ఆధారంగా చేసుకుని ఈ సినిమాను నిర్మించనున్నారు. మన్మోహన్ పీఎంగా ఉన్నప్పుడు దేశంలో చోటుచేసుకున్న రాజకీయ పరిణామాలను ఆధారంగా చేసుకుని ఈ సినిమాను రూపకర్తలు తెరకెక్కించనున్నట్టు ఓ ఆంగ్ల పత్రిక తన కథనంలో పేర్కొంది. మన్మోహన్ పాత్రలో ప్రముఖ బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ నటించనున్నారని తెలుస్తోంది. ఈ సినిమాలో సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇతర ముఖ్య నేతల పాత్రలూ ఉండనున్నట్టు సమాచారం. కాగా, సంజయ్ బారు రచించిన ‘యాక్సిండెంటల్ ప్రైమ్ మినిస్టర్’ ఆధారంగా ఈ సినిమాను రూపొందించనున్నట్టు తెలుస్తోంది.