: మాపై ఇంత కుట్రెందుకు?: మోదీ సర్కారుకు ఎన్డీటీవీ ప్రశ్న


తమ కార్యాలయాలు, చానల్ ప్రమోటర్ల ఇళ్లపై సీబీఐ సోదాలు నిర్వహిస్తుండటం వెనుక కేంద్ర ప్రభుత్వ కుట్ర ఉందని, పత్రికా స్వేచ్ఛపై ఇది రాజకీయ దాడేనని ఎన్డీటీవీ వ్యాఖ్యానించింది. సీబీఐ ఆరోపిస్తున్నట్టుగా ఐసీఐసీఐ బ్యాంకుకు తాము బకాయిలేమీ పడలేదని చెబుతూ, డబ్బు కట్టిన తరువాత తీసుకున్న లేఖను ఎన్డీటీవీ బయటపెట్టింది. సంస్థ మాజీ కన్సల్టెంట్ సంజయ్ దత్ చేసిన తప్పుడు ఆరోపణల ఆధారంగానే కేసులు నమోదయ్యాయని, ఇప్పటి వరకూ ఏ కోర్టు నుంచి కూడా తమకు నోటీసులు అందలేదని, తమ సమాధానం కోసం చూడకుండా దాడులు చేయడం ఏంటని ప్రశ్నించింది.

 ఈ మేరకు సంస్థ ప్రమోటర్ల జంట ప్రణయ్ రాయ్, రాథికా రాయ్ ల పేరిట ఓ ప్రకటన విడుదల చేస్తూ, ఏడేళ్ల క్రితమే ఐసీఐసీఐకి లోన్ చెల్లింపు జరిపిన ప్రతులను విడుదల చేసింది. ఇండియాలో ఎంతో మంది పారిశ్రామికవేత్తలు బ్యాంకులకు కోట్ల రూపాయలు బకాయిలు పడగా, వారెవరిపైనా లేని క్రిమినల్ కేసులు తమపై మోపారని వారు ఆరోపించారు. ఎన్డీటీవీగాని, ప్రమోటర్లుగా తాముగానీ, ఎన్నడూ ఏ బ్యాంకుకూ రుణ బకాయిలు పడలేదని, రుణ చెల్లింపుల్లో తాము పారదర్శకత పాటిస్తున్నామని ప్రణయ్ రాయ్ వెల్లడించారు. తమపై రాజకీయ కుట్రలు ఎన్ని సాగినా, మీడియాకు స్వాతంత్ర్యం కోసం పోరాటం సాగిస్తామని స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News