: వరుణుడి రాకతో ఆస్ట్రేలియాకు శరాఘాతం... గెలిచే మ్యాచ్ లో ఒక పాయింటుతో సరి!
సునాయాసంగా గెలిచి పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి వెళ్లాలన్న ఆస్ట్రేలియా ఆశలను వరుణుడు నీరుగార్చాడు. చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా బలహీనమైన బంగ్లాదేశ్ తో మ్యాచ్ జరుగుతున్న సమయంలో భారీ వర్షం కురవడంతో రెండు పాయింట్లు పొందాలనుకున్న ఆస్ట్రేలియా ఆశలు నీరుగారాయి. తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ జట్టు 183 పరుగులు మాత్రమే చేయగా, ఆస్ట్రేలియా 16 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 83 పరుగులు చేసిన దశలో వర్షం కురిసింది. డక్వర్త్ లూయిస్ విధానంలో కనీసం 20 ఓవర్లు దాటితేగాని విజేతను ప్రకటించే వీలు లేదు. వాస్తవానికి గెలుపునకు కావాల్సిన పరుగులను ఆస్ట్రేలియా సాధించినప్పటికీ, మరో నాలుగు ఓవర్లు ఆడి వుంటేనే విజయం వరించేది.
ఆపై వర్షం తగ్గే సూచనలు కనిపించక పోవడంతో మ్యాచ్ ను రద్దు చేస్తున్నట్టు ప్రకటించిన అంపైర్లు చెరో పాయింట్ నూ ఇచ్చారు. దీంతో గ్రూప్ ఏలో ఒక మ్యాచ్ ఆడిన ఇంగ్లండ్ రెండు పాయింట్లతో ముందుండగా, రెండు మ్యాచ్ లు ఆడి రెండూ రద్దు కాగా, 2 పాయింట్లతో ఆస్ట్రేలియా రెండో స్థానంలో ఉంది. బంగ్లాదేశ్ 2 మ్యాచ్ లు ఆడి ఒక ఓటమి, ఓ రద్దుతో ఒక పాయింట్ తో, న్యూజిలాండ్ జట్టు ఒక మ్యాచ్ ఆడి ఒక రద్దుతో ఒక పాయింట్ తో పట్టికలో చివరి స్థానంలో ఉంది. ఈ నేపథ్యంలో గ్రూప్ ఏ నుంచి నాకౌట్ కు ప్రవేశించే జట్లపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఆస్ట్రేలియా ఇంకా ఒక్క మ్యాచ్ మాత్రమే ఆడాల్సి వుంది. అది కూడా ఇంగ్లండ్ తో. దీనిలో భారీ నెట్ రన్ రేటు సాధిస్తూ గెలిస్తేనే ఆసీస్ కు చాన్స్ ఉంటుంది. మిగతా జట్లకూ అటువంటి చాన్స్ లే ఉండటంతో చివరికి ఎవరు టాప్ లో నిలుస్తారన్న విషయమై సస్పెన్స్ పెరిగింది.