: చాంపియన్స్ ట్రోఫీలో పాక్ ఓటమిపై విరుచుకుపడుతున్న మాజీ క్రికెటర్లు.. సిగ్గుచేటు, అవమానకరమని వ్యాఖ్య!
చాంపియన్స్ ట్రోఫీలో భారత్‌పై ఓడిన పాక్ జట్టుపై ఆ దేశ మాజీ క్రికెటర్లు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. పాక్ ఓటమి సిగ్గుచేటని, అవమానకరమని విమర్శలు గుప్పిస్తున్నారు. ఆదివారం ఎడ్జ్‌బాస్టన్‌లో జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 319 పరుగులు చేసింది. అనంతరం భారీ విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన పాక్ 164 పరుగులకే కుప్పకూలి ఘోర పరాజయం మూటగట్టుకుంది.
పాక్ ఓటమిపై మాజీ క్రికెటర్, రాజకీయ నాయకుడు ఇమ్రాన్‌ఖాన్ మాట్లాడుతూ.. గెలుపోటములు ఏ ఆటలోనైనా సహజమని, అయితే ఆదివారం నాటి మ్యాచ్‌లో పాక్ పోరాడకుండానే ఓడిపోవడం బాధ కలిగించిందని పేర్కొన్నాడు. బోల్డంత సత్తా ఉన్నప్పటికీ పోరాడకపోవడం బాధాకరమన్నాడు. జట్టులో సమూల మార్పులు చేయకపోతే, భారత్ చేతిలో ఎప్పటికీ ఓడిపోతూనే ఉంటుందని పేర్కొన్నాడు.
మాజీ కెప్టెన్ వసీం అక్రం మాట్లాడుతూ.. పాకిస్థాన్ 15 మందితో బరిలోకి దిగినా ఇంతకంటే గొప్ప ఫలితం వస్తుందని తాను భావించడం లేదంటూ తీవ్రస్థాయిలో విమర్శించాడు. భారత్-పాక్ జట్లలో ఉన్న తేడా ఏంటో ఈ మ్యాచ్‌తో తేటతెల్లమైందన్నాడు. భారత్-పాక్ జట్ల మధ్య అంతరం పెరుగుతోందని అఫ్రిది పేర్కొన్నాడు. భారత్ దూసుకుపోతుండగా, పాక్ వెనకబడిపోతోందన్నాడు. పాకిస్థాన్‌కు భారత్‌ను ఓడించే సత్తా లేదన్న విషయాన్ని పాక్ మీడియా ప్రచురిస్తే బాగుంటుందని మాజీ కెప్టెన్ అమీర్ సోహైల్ సలహా ఇచ్చాడు.
ఇంగ్లిష్ పిచ్‌లపై బంతి తిప్పలేని స్పిన్నర్లతో బరిలోకి దిగడం సరికాదని మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ పేర్కొన్నాడు. కాగా, గతంలో భారత్ చేతిలో పాక్ ఓడడం కంటే తాజా ఓటమి పాక్ అభిమానులను కుదురుకోనీయడం లేదు. ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి రేపిన ఈ మ్యాచ్‌లో పాక్ ఘోరంగా ఓడిపోవడం అభిమానులను కలచివేస్తోంది.