: అమెరికా సైనికులతో సన్నిహితంగా గడిపిన సద్దాం హుస్సేన్... వెలుగులోకి ఇరాక్ నియంత ఆఖరి రోజుల విశేషాలు!
సద్దాం హుస్సేన్... దాదాపు మూడు దశాబ్దాల పాటు ఇరాక్ ను కంటి సైగతో శాసించిన నియంత. కువైట్ ను కబళించాలని చేసిన ప్రయత్నం... గల్ఫ్ వార్ కు దారితీసి, చివరకు ఆయన ప్రాణాలు పోయేందుకు కారణమైంది. 2006లో సద్దాంను ఉరి తీశారు.
ఎంతో కఠినంగా ఉండే సద్దాం తన చివరి రోజుల్లో అమెరికా గార్డులతో చాలా సన్నిహితంగా ఉండేవారట. ఈ విషయాన్ని అమెరికన్ గార్డ్ బిల్ బర్డన్ వేర్పర్ తన పుస్తకం 'ది ప్రిజనర్ ఇన్ హిజ్ ప్యాలెస్: సద్దాం హుస్సేన్'లో ప్రస్తావించారు. దాదాపు ఆరు నెలల పాటు సద్దాంకు కాపలాగా ఉన్న 12 మంది అమెరికన్ సైనికులతో సద్దాం చాలా సన్నిహితంగా ఉండేవారని బిల్ బర్డన్ పేర్కొన్నారు. ఉరి కంబం ఎక్కేంత వరకు కూడా గార్డులతో క్లోజ్ గా ఉన్నారని తెలిపారు. జైలు గది బయట ఓ మూలన కూర్చునేవారని... పూవులను చూస్తూ సంతోషంగా సమయాన్ని గడిపేవారని చెప్పారు.
ఆహారం విషయంలో సద్దాం చాలా శ్రద్ధ తీసుకునేవారని... బ్రేక్ ఫాస్టుగా తాజా పండ్లు, కేక్, ఆమ్లెట్ తీసుకునేవారని బిల్ తన పుస్తకంలో తెలిపారు. ఆమ్లెట్ సరిగా లేకపోతే, తినేందుకు నిరాకరించేవారని చెప్పారు. తండ్రితో ఆయనకు ఉన్న అనుభవాలను గార్డులతో పంచుకునేవారని... కొడుకు పట్ల ఓ తండ్రిగా ఎంత క్రమశిక్షణతో ఉండేవాడో చెప్పేవారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా సద్దాం చెప్పిన ఓ ఉదంతాన్ని తన పుస్తకంలో పొందుపరిచారు. ఒకసారి కొందరు వ్యక్తులు పార్టీ జరుపుకుంటుండగా... సద్దాం కుమారుడు ఉదయ్ వారిపై దాడి చేసి, చాలా మంది ప్రాణాలను బలిగొన్నాడట. దీంతో సద్దాంకు చాలా కోపం వచ్చిందట. వెంటనే ఉదయ్ వద్ద ఉన్న రోల్స్ రాయిస్, పోర్షె, ఫెరారీవంటి ఖరీదైన కార్లన్నింటినీ సద్దాం నిప్పు పెట్టి కాల్చేశారట. రేడియోలో పాటలు వింటూ, హమ్ చేసే వారట సద్దాం. అమెరికన్ సింగర్ మేరీ జే బ్లిగే పాటలు అంటే ఆయనకు చాలా ఇష్టమట.