: ఇస్రో 'బాహుబలి' ప్రయోగం నేడే... చరిత్ర సృష్టించనున్న భారత్!
ఆంధ్రప్రదేశ్ లోని పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష ప్రయోగ వేదిక నుంచి ఇస్రో నేడు జీశాట్ 19 ఉపగ్రహాన్ని ప్రయోగించబోతోంది. సాయంత్రం 5.28 గంటలకు జరిగే ఈ ప్రయోగం కోసం ఇప్పటికే కౌంట్ డౌన్ ఆటంకాలు లేకుండా కొనసాగుతోంది. జీఎస్ఎల్వీ ఎంకే3-డీ1 అనే రాకెట్ ద్వారా జీశాట్ 19 ఉపగ్రహాన్ని అంతరిక్ష కక్ష్యలోకి ప్రవేశపెడతారు. దూరదర్శన్ ప్రత్యక్ష ప్రసారం చేయనుంది. ఇస్రో 'బాహుబలి'గా అభివర్ణిస్తున్న ఈ ప్రయోగానికి ఎంతో విశిష్టత, ప్రత్యేకతలు ఉన్నాయి.
జీశాట్ 19 ఉపగ్రహ బరువు 3,136 కిలోగ్రాములు. నిజానికి ఈ స్థాయి బరువున్న ఉపగ్రహాలను ఇంత వరకు మన దేశం నుంచి ప్రయోగించలేదు. ఇదే మొదటిసారి. 2,300 కిలోగ్రాములకు పైన బరువున్న ఉపగ్రహాలను ప్రయోగించేందుకు భారత్ ఇప్పటి వరకు విదేశీ ప్రయోగ కేంద్రాలను ఆశ్రయించాల్సి వచ్చేది. నేటి ప్రయోగం విజయవంతం అయితే ఇక భారత్ విదేశాలపై ఆధారపడనక్కర్లేదు. దీంతో ఒక్కో ప్రయోగం రూపంలో రూ.400 కోట్లు ఆదా అవుతాయి. ఇప్పటి వరకు ఇంత భారీ స్థాయి బరువుగల ఉపగ్రహాలను ప్రయోగించే సామర్థ్యం అమెరికా, రష్యా, చైనా, జపాన్ లకు మాత్రమే ఉండగా, భారత్ కూడా వీటి సరసన చేరుతుంది.
జీఎస్ఎల్వీ ఎంకే3-డీ1ను ఇస్రో స్వయంగా అభివృద్ధి చేసింది. ఇది 4,000 కిలోల వరకు బరువున్న ఉపగ్రహాలను జియోసింక్రనస్ ట్రాన్స్ ఫర్ కక్ష్యలోకి ప్రవేశపెట్టగలదు. తక్కువ ఎత్తులో ఉన్న భూ కక్ష్యలోకి అయితే 10,000 కిలోల బరువుగల ఉపగ్రహాలను ప్రవేశపెట్టగలదు. సైంటిస్టులు దీన్ని మాన్ స్టర్ రాకెట్ గా అభివర్ణిస్తున్నారు. అంతరిక్షంలోకి మానవులను పంపించాలన్న భారత్ కలను ఈ రాకెట్ సాకారం చేయగలదంటున్నారు. ఇప్పటికే ఇందుకోసం ఇస్రో కేంద్ర ప్రభుత్వాన్ని అనుమతి కోరింది. సంబంధిత మిషన్ కోసం రూ.12,500 కోట్లను ఇవ్వాలని కోరింది.
జీశాట్ -19 తో 4జీ, ఇతర సమాచార సేవలు పటిష్ఠం కానున్నాయి. గతంలో ప్రయోగించిన ఆరు సమాచార శాటిలైట్లకు దీటుగా ఒక్క జీశాట్ - 19 పనిచేయనుంది. లిథియం అయాన్ బ్యాటరీలను ఇందులో ఏర్పాటు చేయడం విశేషం.