: 'ఎన్డీటీవీ' అధినేత ప్రణయ్ రాయ్ ఇంటిపై సీబీఐ సోదాలు!
ఐసీఐసీఐ బ్యాంకుకు రూ.48 కోట్ల మేర నష్టం కలిగించారంటూ ఎన్డీటీవీ వ్యవస్థాపకుడు, సహ చైర్మన్ ప్రణయ్ రాయ్, అతని భార్య రాధికా రాయ్, ఆర్ఆర్ పీఆర్ (రాధికా రాయ్, ప్రణయ్ రాయ్) అనే ప్రైవేటు కంపెనీ, మరికొందరిపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) కేసు నమోదు చేసింది. అనంతరం ఈ రోజు ఢిల్లీలోని గ్రేటల్ కైలాష్-1 ప్రాంతంలో ఉన్న రాయ్ నివాసంలో సీబీఐ అధికారులు సోదాలకు దిగారు. మరో నాలుగు ప్రాంతాల్లోనూ సోదాలు చేపట్టినట్టు సమాచారం.
బ్యాంకును మోసం చేసిన కేసుల్లో భాగంగానే ఈ సోదాలు చేపట్టినట్టు సీబీఐ అధికార ప్రతినిధి తెలిపారు. ఐసీఐసీఐ బ్యాంకుకు రుణ ఎగవేతతో ఈ కేసుకు సంబంధం ఉందని సమాచారం. అయితే, రాయ్ తను సొంతంగా రుణం తీసుకుని ఎగ్గొట్టారా? లేక ఎన్డీటీవీ కోసం తీసుకున్నారా? అన్న వివరాలు బయటకు రాలేదు. ఎన్డీటీవీపై ఆరోపణలు రావడం ఇదే మొదటి సారి కాదు. విదేశీ యూనిట్ల ద్వారా భారీ స్థాయిలో నిధులు తరలింపునకు సహకరించడం ద్వారా ఎన్డీటీవీ ఫెమా నిబంధనలు ఉల్లంఘించిందంటూ 2015 నవంబర్ లో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ 2,030 కోట్లకు నోటీసు జారీ చేసింది.