: శాంతి కోసం ఆరాటం.. లౌడ్ స్పీకర్లను త్యజించిన హిందూముస్లింలు!
నిర్ణయం చిన్నదే అయినా శాంతి కోసం ఇరు వర్గాలు తీసుకున్న నిర్ణయం ఇప్పుడా గ్రామాన్ని ప్రత్యేకంగా నిలుపుతోంది. ఉత్తరప్రదేశ్ మొరాదాబాద్ జిల్లాలోని తిరియాడీన్ గ్రామంలో దేవుడి పూజా సమయం, మత సంబంధ కార్యక్రమాల్లో లౌడ్ స్పీకర్లు ఉపయోగించరాదని హిందూ, ముస్లిం పెద్దలు ఓ నిర్ణయానికి వచ్చారు. లౌడ్ స్పీకర్ల వల్ల మతపరమైన ఉద్రిక్తతలు తలెత్తే అవకాశం ఉండడంతో ఇరు వర్గాలు కలిసి ఈ అవగాహనకు వచ్చాయి. శాంతియుత వాతావరణం కోసం వాటిని త్యజించాలని నిర్ణయానికి రావడంతో గ్రామంలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
ఈ విషయమై గ్రామ పెద్ద సునీతా రాణి మాట్లాడుతూ మత సంబంధ కార్యక్రమాల్లో లౌడ్ స్పీకర్లను ఉపయోగించవద్దని హిందూ, ముస్లిం పెద్దలతో చెప్పానని, దానిని వారు అంగీకరించారని తెలిపారు. తీసుకున్న నిర్ణయం చిన్నదే అయినా ఈ ప్రాంతంలో అది శాంతిని తీసుకొస్తుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. నిర్ణయం తీసుకున్న అనంతరం హిందూ ముస్లిం పెద్దలు గ్రామమంతా తిరిగి మసీదులు, ఆలయాల్లో ఉన్న లౌడ్ స్పీకర్లను తొలగించారు. అనంతరం వాటిని పోలీసులకు అప్పగించారు. అంతేకాదు స్థానికులు కూడా ఇకపై తాము లౌడ్ స్పీకర్లు ఉపయోగించబోమని, అది ఎటువంటి కార్యక్రమమైనా వాటికి దూరంగా ఉంటామని ప్రతిజ్ఞ చేశారు.