: ఆగుతూ.. సాగిన దాయాదుల పోరులో భారత్‌దే విజయం.. చిత్తుగా ఓడిన పాక్!
చాంపియన్స్ ట్రోఫీలో భారత్ మరోమారు దాయాది పాకిస్థాన్‌ను చిత్తుచేసింది. ఎడ్జ్‌బాస్టన్‌లో ఆదివారం జరిగిన పోరులో డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో పాకిస్థాన్‌పై 124 పరుగుల తేడాతో విజయం సాధించి పాక్‌పై ఎప్పటికీ తమదే విజయమని మరోమారు చాటింది. వర్షం కారణంగా పలుమార్లు ఆగుతూ సాగిన మ్యాచ్‌లో అసలైన మజా మిస్సయినప్పటికీ ప్రేక్షకులు మాత్రం ఎంజాయ్ చేశారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా నిర్ణీత 48 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 319 పరుగులు చేసి ప్రత్యర్థి ముందు భారీ విజయ లక్ష్యాన్ని ఉంచింది. భారత్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో పదో ఓవర్లో ఓసారి, 34వ ఓవర్లో మరోసారి వరుణుడు అంతరాయం కలిగించడంతో మ్యాచ్‌ను 48 ఓవర్లకు కుదించారు.
భారీ విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన పాక్ జట్టును కూడా వర్షం పలుమార్లు అడ్డుకుంది. దీంతో మ్యాచ్ డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలోకి మారింది. పాకిస్థాన్ లక్ష్యాన్ని 41 ఓవర్లలో 289 పరుగులుగా నిర్దేశించారు. అయితే 33.4 ఓవర్లలో 164 పరుగులకే సర్ఫరాజ్ సేన కుప్పకూలింది. ఫలితంగా 124 పరుగుల తేడాతో భారత్ గ్రాండ్ విక్టరీ నమోదు చేసింది. పాకిస్థాన్ బ్యాట్స్మెన్లలో ఓపెనర్ అజర్ అలీ (50), మహ్మద్ హఫీజ్ (33) మాత్రమే కాస్త పోరాడారు. మిగతావారు క్రీజులోకి వచ్చినట్టే వచ్చి అంతే వేగంగా పెవిలియన్ చేరారు. టీమిండియా బౌలర్లలో ఉమేష్ యాదవ్ 3, రవీంద్ర జడేజా, హార్థిక్ పాండ్యా రెండేసి వికెట్లు నేలకూల్చారు.
అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్.. దాయాది బౌలర్లకు చుక్కలు చూపించింది. ఓపెనర్లు రోహిత్ శర్మ, శిఖర్ ధవన్లు మంచి ఆరంభాన్ని ఇచ్చారు. తొలుత నెమ్మదిగా మొదలైన ఇన్నింగ్స్‌లో తర్వాత జోరు పెంచారు. 119 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్‌లతో 91 పరుగులు చేసిన రోహిత్ శర్మ వివాదాస్పద నిర్ణయంతో రనౌటై తృటిలో సెంచరీ చేజార్చు కున్నాడు. శిఖర్ ధవన్ 65 బంతుల్లో 6 ఫోర్లు, సిక్స్‌తో 68 పరుగులు చేశాడు. అనంతరం బరిలోకి దిగిన కెప్టెన్ కోహ్లీ, యువరాజ్ సింగ్‌లు పాక్ బౌలింగ్‌ను చీల్చి చెండాడారు. బంతి కనిపించడమే పాపమన్నట్టు రెచ్చిపోయారు. 68 బంతుల్లో 6 ఫోర్లు 3 సిక్స్‌లతో కోహ్లీ 81 పరుగులు చేసి నాటౌట్‌గా నిలవగా 32 బంతుల్లో 8 ఫోర్లు, సిక్స్‌తో 53 పరుగులు చేసిన యువరాజ్ చివర్లో ఔటయ్యాడు. అనంతరం బరిలోకి దిగిన హార్థిక్ పాండ్యా చివరి ఓవర్ తొలి మూడు బంతులను వరుసగా సిక్స్‌లు కొట్టి స్కోరు బోర్డును 300 దాటించాడు. 6 బంతులు ఎదుర్కొన్న పాండ్యా 3 సిక్స్‌లతో 20 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. యువరాజ్ సింగ్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది.