: ప్రత్యేక హోదా అడిగే వారికి నల్లజెండాలు చూపుతారా? ప్రత్యేక హోదా రాష్ట్ర జీవన్మరణ సమస్య!: సురవరం సుధాకర్ రెడ్డి
ప్రత్యేక హోదా అనేది ఏపీకి జీవన్మరణ సమస్యని సీీపీఐ నేత సురవరం సుధాకర్ రెడ్డి అన్నారు. గుంటూరులో జరుగుతున్న 'ప్రత్యేక హోదాకు భరోసా' సభలో ఆయన పాల్గొని ప్రసంగింస్తూ, ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం కాదని, వచ్చే వరకు తెరిచిన అధ్యాయమేనని అన్నారు. ఈ సభ ఏర్పాటు చేసింది ఎన్నికల కోసమో, ఓట్ల కోసమో, చంద్రబాబును గద్దె నుంచి దింపడం కోసమో కాదని అన్నారు. కాంగ్రెస్ పార్టీ సభ ఏర్పాటు చేస్తే ప్రత్యేక హోదాను బలపరిచేందుకు వచ్చామని, ప్రత్యేక హోదా కోసం పని చేసే ప్రతి వ్యక్తి, సంస్థకు మద్దతు ఇవ్వాలని అన్నారు.
పెట్టుబడుల పేరుతో వందల కోట్లు బూడిదలో పోస్తున్నారని, ఏపీలో పరిశ్రమలు, ఉద్యోగాల కోసమే ప్రత్యేక హోదా కోరుతున్నామని అన్నారు. ప్రత్యేక హోదా రాజకీయ సమస్య కాదని, ఆర్థిక సమస్య అని అన్నారు. కేంద్ర సర్కార్ కు చంద్రబాబు నాయుడు ఎందుకు సాగిలపడుతున్నారో టీడీపీ నేతలు తమ అధినేతను నిలదీయాలని సూచించారు. ప్రత్యేక హోదా కోరితే ప్రగతి వ్యతిరేకులా? ప్రత్యేక హోదా అడిగే వారికి నల్లజెండాలు చూపుతారా? అని సురవరం ప్రశ్నించారు.
అంతకుముందు, సీపీఐ నేత డి.రాజా మాట్లాడుతూ, ప్రత్యేక హోదాకు సీపీఐ మద్దతు ఇస్తుందని, పోరాడుతుందని అన్నారు. రాష్ట్ర విభజన జరిగినప్పుడు బీజేపీ నేతలు ప్రత్యేక హోదా కోసం పట్టుబట్టారని, ఇప్పుడేమో ప్రత్యేకహోదాను పక్కన బెట్టారని విమర్శించారు. రాజ్యసభలో నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ ఇచ్చిన హామీని మోదీ సర్కార్ నెరవేర్చాలని, ప్రత్యేక హోదా కోసం ఏపీ ప్రజలు పోరాడాల్సిన అవసరం ఉందని అన్నారు.