: గురువుగారు ఆపరేషన్ థియేటర్ కి వెళ్లే ముందు ఆస్తుల గురించి అడిగాను.. ఆయన ఓ వ్యక్తిని చూపించారు!: మోహన్ బాబు
దివంగత దర్శకుడు దాసరి నారాయణరావు కన్న బిడ్డలకు సంబంధించిన ఆస్తి పంపకాల గురించి ఇప్పుడు మాట్లాడటం తొందరపాటు చర్య అవుతుందని నటుడు మోహన్ బాబు అన్నారు. దాసరి నారాయణరావు తన పిల్లలకు ఆస్తి పంపకాలు చేశారా? అని తాజా ఇంటర్వ్యూలో మోహన్ బాబును ప్రశ్నించగా.. ఈ విషయమై సమస్యలు ఉన్నాయని, పరిష్కరించే బాధ్యత తనపై ఉందని అన్నారు. తనతో దాసరి నారాయణరావు పెద్దకొడుకు ప్రభు, అల్లుడు రఘు మాట్లాడుతుంటారని చెప్పారు.
ఆస్తుల పంపకాలు సాఫీగా జరిగేలా చూసుకోవాల్సిన బాధ్యత తనపై ఉందని అన్నారు. ‘దాసరి గారు బతికుండగా ఆర్థిక వ్యవహారాల గురించి మీరు ఆయనతో మాట్లాడారా?’ అని ప్రశ్నించగా, ‘గురువుగారు రెండోసారి ఆసుపత్రిలో చేరి, ఆపరేషన్ థియేటర్ కి వెళ్లే ముందు ఆ విషయాన్ని ప్రస్తావించాను. ‘పిల్లలకు ఏమీ చేయలేదు, ఇంకా ఏమైనా సెటిల్ చేయాల్సినవి ఉంటే చెప్పండి’ అని అడిగాను. అప్పుడు.. ఎదురుగా ఉన్న ఓ వ్యక్తిని చూపించారు. ఆ వ్యక్తి ఒకటి రెండు విషయాలు చెప్పారు. అంతకుమించి, ఏం చెప్పలేదు’ అని మోహన్ బాబు చెప్పుకొచ్చారు.