: నాన్న చేతిలో మొదటిసారి దెబ్బలు తిన్నది అప్పుడే!: టీడీపీ ఎమ్మెల్యే అనిత
తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, ప్రముఖ సినీ నటుడు నటుడు ఎన్టీఆర్ అంటే తన తండ్రికి చెప్పలేనంత అభిమానమని ఏపీ టీడీపీ ఎమ్మెల్యే అనిత అన్నారు. తన చిన్నతనంలో జరిగిన పలు ఆసక్తికర విషయాలను ఓ ఇంటర్వ్యూలో ఆమె ప్రస్తావించారు. ఎన్టీఆర్ పై తన తండ్రికి ఉన్న వీరాభిమానం కారణంగా మొదటిసారి ఆయన చేతిలో దెబ్బలు తిన్నానని చెబుతూ, కళాశాల విద్యను అభ్యసించే రోజుల్లో జరిగిన ఓ సంఘటనను అనిత గుర్తుచేసుకున్నారు.
‘అవి 1996లో నేను ఇంటర్ మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతున్న రోజులు. ఓ రోజు ట్యూషన్ నుంచి ఇంటికి తిరిగి వస్తూ.. నా చేతిలో ఉన్న పుస్తకాన్ని గాల్లోకి ఎగరేస్తూ ‘డాడీ, ఎన్టీఆర్ చనిపోయాడంట’ అన్నాను. అంతే, మా నాన్న వెంటనే నన్ను కొట్టారు. ‘ఎన్టీఆర్ గురించి అసలు నీకేం తెలుసు? ఆయన్ని ఏకవచనంతో ‘చనిపోయాడు’ అంటావా? ఎన్టీఆర్ చనిపోతే ఏ మాత్రం బాధ లేకుండా ఎలా మాట్లాడుతున్నావు?’ అని నాన్న అనడంతో నా నోట మాట రాలేదు. కొంచెం సేపటి తర్వాత నాన్న దగ్గరకు వెళ్లి అడిగితే ఎన్టీఆర్ గురించి చెప్పారు. దీంతో, ఎన్టీఆర్ పై నాకు విపరీతమైన అభిమానం ఏర్పడింది. ఎన్టీఆర్ గారిని చూస్తే ఇప్పటికే నా తండ్రి నన్ను కొట్టిన చెంపదెబ్బె గుర్తొస్తుంటుంది’ అని అనిత చెప్పుకొచ్చారు.