: మా గురువు గారికి చంద్రబాబును పరిచయం చేసింది నేనే!: మోహన్ బాబు
తన గురువు దర్శకుడు దాసరి నారాయణరావు చనిపోయినప్పుడు సినీ పరిశ్రమ సరిగా పట్టించుకోలేదన్నది వాస్తవమని సీనియర్ నటుడు మోహన్ బాబు అన్నారు. ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, ఓ గొప్ప వ్యక్తి, మేధావి అయిన దాసరి నారాయణరావుకు అంతిమ వీడ్కోలు సరిగా పలకలేదని విమర్శించారు. దాసరి మృతి వార్త తెలియగానే విజయవాడ నుంచి ప్రత్యేకంగా వచ్చి తన గురువుకు నివాళులర్పించిన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుని అభినందించాలని అన్నారు.
అసలు తన గురువు దాసరి నారాయణరావుకు చంద్రబాబును మొట్టమొదట పరిచయం చేసిన ఘనత తనదేనని ఈ సందర్భంగా మోహన్ బాబు చెప్పారు. నాడు తిరుపతిలో ‘శివరంజని’ సినిమా ఫంక్షన్ జరిగినప్పుడు చంద్రబాబు ఎమ్మెల్యేగా ఉన్నారని ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. చంద్రబాబు తనకు బంధువు, స్నేహితుడు కావడంతో నాడు వేదికపై దాసరి పక్కనే చంద్రబాబును కూర్చోపెట్టించానని మోహన్ బాబు చెప్పుకొచ్చారు.