: కుటుంబ రాజకీయాలపై రాహుల్ మాట్లాడటం విడ్డూరంగా ఉంది: వెంకయ్యనాయుడు
కుటుంబ రాజకీయాలపై రాహుల్ గాంధీ మాట్లాడటం విడ్డూరంగా ఉందని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు విమర్శించారు. ఈ రోజు ఆయన విలేకరులతో మాట్లాడుతూ, వారసత్వ రాజకీయాలను పెంచి పోషించింది కాంగ్రెస్ పార్టీయేనని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీలో వారసత్వమే ఉందని, జవసత్వం లేదని, ప్రతి అంశాన్ని రాజకీయం చేసి లబ్ధి పొందాలని ఆ పార్టీ చూస్తోందని ఆయన దుయ్యబట్టారు. ప్రజల వ్యక్తిగత ఆహారపు అలవాట్లపై ప్రభుత్వం జోక్యం చేసుకోదని, గోవధ నిషేధంపై కొన్ని రాష్ట్రాల్లో ఇప్పటికే చట్టాలు వున్నాయని, అవి కూడా కాంగ్రెస్ పాలనలో తీసుకువచ్చినవేనని అన్నారు. దేశంలో మావోయిస్టుల ప్రాబల్యం తగ్గిందని ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు తెలిపారు.