: మంత్రి హరీష్ రావును సూపర్ స్టార్ మహేష్ బాబుతో పోల్చిన నటుడు!
రాజకీయాల్లో అనునిత్యం బిజీబిజీగా ఉంటూ, ఎల్లప్పుడూ వైట్ అండ్ వైట్ డ్రస్సులో కనిపించే మంత్రి హరీష్ రావు... టీషర్ట్ లో అచ్చం సూపర్ స్టార్ మహేష్ బాబులా కనిపిస్తున్నారంటూ జబర్దస్త్ షో కమెడియన్ అదిరే అభి అన్నాడు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం, మంత్రి హరీష్ జన్మదినాలను పురస్కరించుకుని నిన్న రాత్రి సిద్ధిపేటలోని కోమటి చెరువు వద్ద తెలంగాణ సాంస్కృతిక సంస్థ ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా అదిరే అభి మాట్లాడుతూ హరీష్ పై ప్రశంసలు కురిపించారు. గతంలో ఉన్న సిద్ధిపేటకు, ఇప్పుడున్న సిద్ధిపేటకు ఎంతో తేడా ఉందని ఆయన అన్నాడు. హరీష్ రావు నేతృత్వంలో సిద్ధిపేట హైదరాబాదులా మారిందని చెప్పాడు. ఈ కార్యక్రమానికి హరీష్ రావుతో పాటు, పలువురు ప్రజా ప్రతినిధులు, రాజకీయ నేతలు, జిల్లా కలెక్టర్ తదితరులు హాజరయ్యారు.