: దాసరి చనిపోయినప్పుడు వాళ్లు ఎందుకు రాలేదు?.. ఇది చాలా దారుణం!: మోహన్ బాబు
దర్శకరత్న దాసరి నారాయణరావు పార్థివదేహాన్ని చివరిసారి చూసేందుకు ఇండస్ట్రీలోని కొందరు ప్రముఖులు రాకపోవడంపై నటుడు మోహన్ బాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఎంతో మందికి దాసరి సహాయం చేశారని... ఎన్నో ఇళ్లలో దీపం వెలిగించారని ఆయన అన్నారు. ఆయన ద్వారా ఎంతో మంది లబ్ధి పొందారు... మరి, ఆయన చనిపోయినప్పుడు ఎంత మంది వచ్చారో లెక్కిస్తే, గుండె తరుక్కుపోతుందని అన్నారు.
సపోర్టింగ్ పాత్రలు చేసుకునే ఎంతో మందిని ఆయన హీరోలుగా చేశారని... ఎంతో మంది హీరోయిన్లకు గుర్తింపును తీసుకొచ్చారని తెలిపారు. వారంతా దాసరిగారిని కడసారి చూసేందుకు ఎందుకు రాలేకపోయారని అన్నారు. తాను ఎవరి పేరును చెప్పనని... కానీ, వారు చేసింది మాత్రం చాలా దారుణమని అన్నారు. ఊర్లో లేనివారి గురించి మనం మాట్లాడకూడదని... కానీ, అందుబాటులో ఉండికూడా, రాకపోవడం సరైనది కాదని చెప్పారు. చావు ప్రతి ఒక్కరికీ వస్తుందనీ... ఆ విషయాన్ని అందరూ గుర్తుంచుకోవాలని అన్నారు.