: ప్రెజర్ టెస్ట్‌లో పాసైన దక్షిణాఫ్రికా.. శ్రీలంక ఘోర పరాజయం
చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా ఘన విజయం సాధించింది. శనివారం ఓవల్‌లో జరిగిన గ్రూప్-బి మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన సఫారీలు నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్లు నష్టపోయి 299 పరుగులు చేశారు. అనంతరం భారీ లక్ష్య ఛేదనతో బరిలోకి దిగిన శ్రీలంక 203 పరుగులకే ఆలౌటై పరాజయం మూటగట్టుకుంది. దక్షిణాఫ్రికా బౌలర్ల ధాటికి శ్రీలంక బ్యాట్స్‌మన్ క్రీజులో కుదురుకునేందుకు ఇబ్బంది పడ్డారు. నిరోషన్ డిక్‌వెల్లా (41), కెప్టెన్ ఉపుల్ తరంగ (57), కుశాల్ పెరీరా (44) మినహా మిగతా బ్యాట్స్‌మన్ 15 పరుగులు కూడా చేయలేకపోయారు. ఫలితంగా 41.3 ఓవర్లలోనే 203 పరుగులకు ఆలౌటై 96 పరుగుల తేడాతో సఫారీలకు మ్యాచ్ సమర్పించుకున్నారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో డుమినీ 4 వికెట్లతో శ్రీలంక వెన్ను విరచగా మోరిస్ 2, రబడ, మోర్కెల్‌లు చెరో వికెట్ తీశారు.
కాగా, తొలుత బ్యాటింగ్‌కు దిగిన సౌతాఫ్రికా శ్రీలంక బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంది. ఓపెనర్ హషీం ఆమ్లా 115 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 103 పరుగులు చేసి సత్తా చాటాడు. డుప్లెసిస్ 75 పరుగులు చేశాడు. డికాక్ (23), డుమినీ (38), క్రిస్ మోరిస్ (20) ఫరవాలేదనిపించారు. శ్రీలంక బౌలర్లలో నువాన్ ప్రదీప్ 2, లక్మల్, ప్రసన్న చెరో వికెట్ నేల కూల్చారు. మ్యాచ్ అనంతరం డివిల్లీర్స్ మాట్లాడుతూ మ్యాచ్‌కు ముందు తమపై విపరీతమైన ఒత్తిడి ఉందని పేర్కొన్నాడు. అయితే దానిని విజయవంతంగా అధిగమించామన్నాడు. తొలి ఓవర్లలో బిగించిన పట్టును చివరి వరకు సడలిపోకుండా చూడడంలో విజయం సాధించామని పేర్కొన్నాడు.