: బీజేపీని విమర్శిస్తూ బుక్‌లెట్ విడుదల చేసి తీవ్ర విమర్శల పాలైన కాంగ్రెస్.. ఘోర తప్పిదం!
కాంగ్రెస్‌కు కాలం కలిసి వస్తున్నట్టు లేదు. ఏ కార్యక్రమం చేపట్టినా తిరిగి అది బూమరాంగ్‌లా మారుతోంది. శనివారం కాంగ్రెస్ సీనియర్ నేత గులాంనబీ ఆజాద్ లక్నోలో మీడియాతో మాట్లాడుతూ మోదీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. పాకిస్థాన్, చైనాలతో సంబంధాల విషయంలో మోదీ పూర్తిగా విఫలమయ్యారని దుమ్మెత్తిపోశారు. ఈ సందర్భంగా ఆయన ఓ బుక్‌లెట్‌ను విడుదల చేశారు. అంతవరకు బాగానే ఉన్నా.. అందులోని మ్యాప్‌లో ఉన్న కశ్మీర్‌ను ‘పాక్ ఆక్రమిత కశ్మీర్’ అని ముద్రించడం తీవ్ర దుమారం రేపుతోంది. అన్ని వైపుల నుంచి విమర్శలు చుట్టుముడుతున్నాయి. కాంగ్రెస్ ఘోర తప్పిదంపై తక్షణం స్పందించిన బీజేపీ విరుచుకుపడింది. పాకిస్థాన్‌పై తనకున్న ప్రేమను కాంగ్రెస్ ఇలా చాటుకుందని విమర్శించింది.
చేసిన తప్పును గ్రహించిన కాంగ్రెస్ వెంటనే క్షమాపణలు తెలిపింది. ఆ బుక్‌లెట్‌ను విడుదల చేయబోమని తేల్చి చెప్పింది. గతంలో బీజేపీ కూడా ఇలాంటి తప్పిదమే చేసిందని వంక చెబుతూ, తప్పించుకునే ప్రయత్నం చేసింది. ఆజాద్ లాంటి సీనియర్ నేత ఇలా చేయడం సరికాదని కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్ అన్నారు. కాంగ్రెస్ పాకిస్థాన్ పక్షాన మాట్లాడుతోందా? అని ప్రశ్నించారు. జరిగిన తప్పిదంపై కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీ క్షమాపణలు చెప్పాలని యూపీ మంత్రి శ్రీకాంత్ శర్మ డిమాండ్ చేశారు. మ్యాప్ ఘటనపై కాంగ్రెస్ నేతలు కూడా ఒకింత అసహనం వ్యక్తం చేస్తున్నారు.