: భారత్ కు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసిన డొనాల్డ్ ట్రంప్.. మోదీ అమెరికా పర్యటనపై ప్రభావం?
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పారిస్ ఒప్పందం నుంచి వైదొలుగుతున్నట్లు కీలక నిర్ణయం తీసుకుని అలజడి రేపిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన చేసిన వ్యాఖ్యల ప్రభావం భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమెరికా పర్యటన మీద పడేలా ఉంది. పారిస్ ఒప్పందం నుంచి వైదొలిగినట్లు చెప్పిన ట్రంప్.. చైనాతోపాటు భారత్‌పై పలు వ్యాఖ్యలు చేశారు. భారత్, చైనాలకు లబ్ధి చేకూర్చడం కోసమే క్రూరమైన ఈ పర్యావరణ ఒప్పందాన్ని రూపొందించారంటూ పలు వ్యాఖ్యలు చేశారు. ఈ ఒప్పందం వల్ల ఇండియాకు బిలియన్ల కొద్ది డాలర్లు విదేశీ సాయం కింద వస్తాయని అన్నారు.
తమదేశ ఆర్థిక వ్యవస్థకు మాత్రం ఈ ఒప్పందం వ్యతిరేకంగా ఉందని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యల నేపథ్యంలోనే మోదీ అమెరికా పర్యటనకు వెళతారా? వెళ్లరా? అనే ప్రశ్నలను రేకెత్తిస్తున్నాయి. ఈ నెల 26-27 తేదీల్లో మోదీ తమ అధ్యక్షుడు ట్రంప్‌తో భేటీ కానున్నారని వైట్ హౌస్ కొన్ని నెలల ముందే ప్రకటించింది. మరోవైపు భారత్‌ను ఉద్దేశిస్తూ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ఘోరంగా ఉన్నాయని, సర్వత్రా విమర్శలు ఎదురవుతున్నాయి. ఈ వ్యాఖ్యలు భారత్‌లోనే కాక అమెరికాలోనూ సంచలనం కలిగిస్తున్నాయి.