: బీజేపీతో కలిసేందుకు జగన్ తాపత్రయపడుతున్నారు!: తులసిరెడ్డి విమర్శ
ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై కాంగ్రెస్ సీనియర్ నేత తులసిరెడ్డి విమర్శలు గుప్పించారు. ఈ రోజు గుంటూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ.... ఏపీకి ప్రత్యేక హోదాను దక్కకుండా చేసిన బీజేపీతో కలిసేందుకు జగన్ తాపత్రయపడుతున్నారని అన్నారు. ఓ వైపు రాష్ట్రపతి ఎన్నికల షెడ్యూల్ ను ఇంకా ప్రకటించలేదని, మరోవైపు జగన్ మాత్రం అప్పుడే ఎన్డీయే అభ్యర్థికి మద్దతు తెలుపుతామని ప్రకటించారని ఆయన అన్నారు. తమ పార్టీ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తొలిరోజునే ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇస్తుందని తెలిపారు. త్వరలోనే ఏపీలో పర్యటించనున్న తమ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ గుంటూరులో ప్రత్యేక భరోసా సభలో పాల్గొంటారని, ప్రత్యేక హోదాపై ఏపీ ప్రజలకు హామీ ఇస్తారని వెల్లడించారు. ఈ సభకు దేశంలోని ఎనిమిది ప్రముఖ పార్టీల నేతలు కూడా హాజరవుతారని ఆయన చెప్పారు.