: అతి సున్నితమైన అంశాలను ముక్కుమొహం తెలియని వారితో పంచుకుంటున్న యువత!: కాస్పెర్‌స్కై వార్నింగ్
ప్రస్తుత కాలంలో ప్రజలు సోషల్ మీడియాను ఎంతగా ఉపయోగిస్తున్నారో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అదే యూజర్ల కాలక్షేపం, హాబీగా మారిపోయింది. ఆన్‌లైన్‌లో తెలిసిన వారితోనే కాక తెలియని వారితోనూ ఎంతో క్లోజ్‌గా చాటింగ్ చేస్తున్నారు. తమ ఫొటోలు, వీడియోలను ముక్కుమొహం తెలియని వారికి సెండ్ చేస్తున్నారు. దీంతో ఎన్నో చిక్కుల్లో పడుతున్నారు. ఈ అంశంపై మాస్కోకు చెందిన సెక్యూరిటీ సంస్థ కాస్పెర్‌స్కై తాజాగా పలు వివరాలు తెలిపింది. సామాజిక మాధ్యమాల్లో ఎంతో మంది యువతీయువకులు తమ పర్సనల్ డేటాను తెలియని వారితో పంచుకుంటున్నారని, వాటిలో అతి సున్నితమైన విషయాలు కూడా ఉంటున్నాయని పేర్కొంది.
సోషల్ మీడియాలో ఉన్న మొత్తం యూజర్లలో 93 శాతం మంది తమకు సంబంధించిన విషయాలను ఇతరులతో పంచుకుంటున్నారని తెలిపింది. అందులో 45 శాతం మంది తమ వ్యక్తిగత వీడియోలు, ఫొటోలను షేర్ చేస్తున్నట్లు ఆ సంస్థ పేర్కొంది. ఇక 70 శాతం మంది యూజర్లు తమ పిల్లల ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నట్లు తెలిపింది. అయితే, ఈ అలవాటు మంచిది కాదని ఆ సంస్థ సూచించింది. తెలియని వ్యక్తులతో అన్ని విషయాలు పంచుకోవడం అనే అలవాటు ఎక్కడికి దారి తీస్తుందో ఊహించడం కూడా కష్టమని చెప్పింది.